Movie roundup for February 2023: ఫిబ్రవరి మ్యాజిక్ పనిచేయలేదు.. బాక్సాఫీస్ వద్ద నిరాశ-movies are disappointed in february 2023 magic not repeated ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Movies Are Disappointed In February 2023 Magic Not Repeated

Movie roundup for February 2023: ఫిబ్రవరి మ్యాజిక్ పనిచేయలేదు.. బాక్సాఫీస్ వద్ద నిరాశ

Maragani Govardhan HT Telugu
Mar 01, 2023 07:28 AM IST

Movie roundup for February 2023: గత మూడేళ్లుగా ఫిబ్రవరి మాసంలో తెలుగులో అదిరిపోయే విజయాలు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఈ నెలలో అనుకున్న స్థాయిలో సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేదు.

పనిచేయని ఫిబ్రవరి మ్యాజిక్
పనిచేయని ఫిబ్రవరి మ్యాజిక్

Movie roundup for February 2023: ఫిబ్రవరి నెల అంటేనే సినిమాలకు అన్ సీజన్. నూతన ఏడాది, సంక్రాంతి ఒకే నెలలో రావడంతో తెలుగు చిత్రాలకు ఈ సీజన్‌లో వసూళ్ల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే కూడా జనవరిలోనే ఉండటంతో మూవీస్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. కానీ ఫిబ్రవరి నెలలో మాత్రం స్టార్ హీరోల సినిమాలు పెద్దగా విడుదల కావు. పైపెచ్చు పరీక్షలసమయం కావడంతో వసూళ్లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. కానీ గత మూడేళ్లుగా ఫిబ్రవరిలో విడుదలైన ఎన్నో సినిమాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. గతేడాది డీజే టిల్లు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు వసూళ్ల వర్షాన్ని సృష్టించాయి. 2021 ఫిబ్రవరిలో అయితే ఉప్పెన సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 2020లోనూ భీష్మ చిత్రంతో నితిన్ సూపర్ హిట్‌ను సాధించాడు. ఈ విధంగా గత మూడేళ్లుగా ఫిబ్రవరి మాసం తెలుగు ప్రేక్షకులకు బాగానే కలిసొచ్చింది. కానీ ఈ సారి మాత్రం ఫైర్ బ్యాక్ అయింది.

ఈ ఫిబ్రవరిలో 22 సినిమాలో విడుదలైతే ఒకటి, రెండు మినహా మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ రేంజ్ హిట్ అయితే కాలేదు. ఈ ఫిబ్రవరిలో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకోలేకపోయాయి.

ఫస్ట్ వీక్ పద్మభూషణ్‌దే..

ఫిబ్రవరి మొదటి వారంలో రైటర్ పద్మభూషణ్‌తో సుహాస్ సందడి చేశాడు. కలర్ ఫొటోతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో నుంచి థియేటర్లలో విడుదలైన తొలి సినిమా ఇదే కావడం విశేషం. అనుకున్నట్లుగానే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని సుహాస్ కెరీర్‌లోనే మంచి విజయాన్ని అందించింది. రివ్యూస్, ఆడియెన్స్‌ నుంచి కూడా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేసేంత రాలేదనే చెప్పాలి.

ఇదే వారం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సందీప్ కిషన్ మైఖేల్ పరాజయం పాలైంది. విడుదలైన తొలి రోజే నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇక మలయాళం రీమేక్‌గా తెరకెక్కిన బుట్టబొమ్మ కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తొలి వారం పద్మభూషణ్ మినహా మిగిలిన సినిమాలు నిరుత్సాహపరిచాయి.

కలిసి రాని సెకండ్ వీక్..

ఇక ఫిబ్రవరి రెండో వారం కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ విడుదలైంది. కల్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేదు. బింబిసార లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత నందమూరి హీరో నుంచి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇదే వారం వేద, పాప్ కార్న్, వసంత కోకిల, అల్లంత దూరాన లాంటి చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ ఏవి కూడా విజయాన్ని అందుకోలేదు.

మూడో వారం ధనుష్‌దే..

ఫిబ్రవరి మూడో వారంలో ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీ విడుదలైంది. కోలీవుడ్ హీరో నటించిన తొలి తెలుగు చిత్రం కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ ఆరంభంలో పెద్దగా రానప్పటికీ తర్వాత సినిమా టాక్ బాగుండటంతో వసూళ్లు పెరిగాయి. ధనుష్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా వెంకీ అట్లూరి టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ఫిబ్రవరి మాసంలో ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్ల వసూళ్లను సాధించింది.

నాలుగో వారమూ నిరాశే..

ఫిబ్రవరి నాలుగో వారంలో అన్నీ చిన్న సినిమాలే సందడి చేశాయి. కోన సీమ థగ్స్, డెడ్ లైన్, మిస్టర్ కింగ్ లాంటి చిన్న సినిమాలు వచ్చాయి. అయితే వీటిల్లో ఏది కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. విభిన్న కంటెంట్ కోసం చూస్తున్న ఆడియెన్స్‌కు రొటీన్ రొట్ట కథలతో విసుగుతెప్పించాయి.

ఓవరాల్‌గా ఫిబ్రవరి మాసం సినీ ప్రియులను నిరాశ పరిచిందనే చెప్పాలి. రైటర్ పద్మభూషణ్, సార్ సినిమాలు మినహా మిగిలినవన్నీ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ఎన్నో అంచనాల మధ్య నడుమ విడుదలైన అమిగోస్, మైఖేల్, బుట్టబొమ్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచాయి.

IPL_Entry_Point