ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్స్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను బంద్ చేయాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్‍లో నేడు (మే 18) రెండు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లను మూసేస్తామని ప్రకటించారు. నిర్మాతలకు ఓ డిమాండ్ చేశారు.
సినిమాలను రెంట్ పద్ధతిలో ఇక ప్రదర్శించలేమని, పర్సంటేజ్ రూపంలో చెలిస్తేనే సాధ్యమవుతుందని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు దిల్‍రాజు, సురేశ్ బాబు కూడా హాజరయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
రోజువారి అద్దె కాకుండా గ్రాస్ కలెక్షన్లలో వాటా ఇస్తేనే సినిమాలను ఇక ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను బంద్ చేస్తామని ప్రకటించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు చిత్రం జూన్ 12వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో ఈ పీరియడ్ యాక్షన్ మూవీ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన కుబేర జూన్ 20న రిలీజ్ కానుంది. మంచు విష్ణు ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. కమల్ హాసన్ తమిళ మూవీ థగ్ లైఫ్ జూన్ 5న తెలుగులోనూ రానుంది.
ఇలా నాలుగు పాన్ ఇండియా చిత్రాలు జూన్‍లో విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది.
ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లు బంద్ చేయక ముందే ఇరు వైపుల ప్రతినిధులు సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అద్దె కాకుండా షేర్ పద్ధతినే పాటించాలని ఎగ్జిబిటర్లు కొంతకాలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లను నడిపేందుకు ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, అద్దె రూపంలో ఇచ్చేది సరిపోవడం లేదని, నష్టాలకు గురవుతున్నామని చెబుతున్నారు. మరి ఈ డిమాండ్‍కు నిర్మాతలు ఎలా స్పందిస్తారో.. ఈ సందిగ్ధత ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం