Most Films in a year: ఒకే ఏడాది 35 సినిమాలు.. ఈ స్టార్ హీరో రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా?
Most Films in a year: ఒక ఏడాదిలో ఏ హీరో అయినా గరిష్ఠంగా ఎన్ని సినిమాలు చేయగలడు? ఐదు, పది, ఇరవై.. ఏడాదికి కాదు కదా మూడు, నాలుగేళ్లకు ఒక సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఇది అసాధ్యం. కానీ ఓ హీరో మాత్రం ఒకే ఏడాది ఏకంగా 35 సినిమాలు చేశాడంటే నమ్మగలరా?
Most Films in a year: ఇప్పటి హీరోలను మనం చూస్తున్నాం కదా. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు. ఒక్కోసారి రెండు, మూడేళ్లు ఒకే ప్రాజెక్టుపైనా గడిపేస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల కింద ఈ పరిస్థితి లేదు. ఒకే ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు. అలాంటి వారిలో ఏకంగా 35 సినిమాలతో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
మమ్ముట్టి.. ఒకే ఏడాది 35 సినిమాలు
మమ్ముట్టి.. మలయాళం ఇండస్ట్రీలో ఓ మెగాస్టార్. ఇప్పటికే 400కుపైగా సినిమాల్లో నటించిన ఘనత అతని సొంతం. ఎప్పుడో 1971లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో.. 1980ల్లో ఓ వెలుగు వెలిగాడు. ఆ పదేళ్లు అతని కెరీర్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ముఖ్యంగా 1986 అతని కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేకం.
ఆ ఏడాది మమ్ముట్టి ఏకంగా 35 సినిమాల్లో నటించడం విశేషం. నిజానికి 1981 నుంచి 1989 వరకు అతడు దాదాపు ప్రతి ఏటా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా.. 1986లో మాత్రం రికార్డు స్థాయిలో 35 సినిమాల్లో కనిపించాడు. వాటిలో ఒక సినిమాలో మాత్రం అతిథి పాత్ర కాగా.. మిగిలినవన్నీ లీడ్ రోల్సే కావడం మరో విశేషం.
ఊహకందని రికార్డు
మమ్ముట్టి అంతకుముందు 1983, 1984, 1985లలోనూ వరుసగా మూడేళ్లు ప్రతి ఏటా 30కిపైగా సినిమాల్లోనే నటించాడు. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు. అంటే అతడు నాలుగేళ్లలోనే కనీసం 140 వరకు సినిమాల్లో నటించాడు. కొన్ని దశాబ్దాల కెరీర్లోనూ సాధ్యం కాని రికార్డు ఇది.
ఇప్పటికీ మమ్ముట్టి జోరు ఏమాత్రం తగ్గలేదు. అతడు గత మూడేళ్లుగా చాలా బిజీ అయ్యాడు. 2022లో ఐదు సినిమాల్లో, 2023లో నాలుగు సినిమాల్లో నటించాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ కాగా.. మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.
ఈ మలయాళ మెగాస్టార్ తెలుగులోనూ నేరుగా ఐదు సినిమాలు చేశాడు. తొలిసారి 1992లో వచ్చిన స్వాతి కిరణం మూవీలో తన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత 1997లో వచ్చిన సూర్యపుత్రులు సినిమాలోనూ కనిపించాడు. 2019లో యాత్ర మూవీలో దివంగత వైఎస్సార్ పాత్రలో తొలిసారి నటించగా.. ఈ ఏడాది యాత్ర 2తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మధ్యలో ఏజెంట్ మూవీలోనూ నటించాడు.
మమ్ముట్టి లగ్జరీ లైఫ్
మెగాస్టార్ మమ్ముట్టి సినిమాల్లో బిజీగా ఉండటమే కాదు.. లగ్జరీ జీవితం కూడా గడుపుతాడు. అతని దగ్గర సుమారు రూ.100 కోట్ల విలువైన సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయంటే నమ్మగలరా? మొదట్లో లా చదివి, లాయర్ గానూ రెండేళ్లు ప్రాక్టీస్ చేసి తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన మమ్ముట్టి.. తన విలక్షణ నటనతో భాషలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
మమ్ముట్టి దగ్గర 369 నంబర్ తోనే ఉన్న ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో బీఎండబ్ల్యూ, మినీ కూపర్, మెర్సెడీస్, పోర్షెలాంటి లగ్జరీ కంపెనీల కార్లు ఉండటం విశేషం. మలయాళంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్లలో మమ్ముట్టి ఒకడు. అతడు ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్లు అందుకుంటాడు.