హాలీవుడ్ నుంచి ఇప్పుడో సినిమా రాబోతోంది. ఈ మూవీ బడ్జెట్ పక్కన పెడితే.. కేవలం ఇందులో నటించే యాక్టర్స్ రెమ్యునరేషన్లే ఏకంగా రూ.2100 కోట్లు అంటే నమ్మగలరా? ఇది ఇండియా కాదు కదా ఎన్నో హాలీవుడ్ టాప్ సినిమాల బడ్జెట్ కంటే ఎక్కువే. ఇక ఈ మూవీ మొత్తం బడ్జెట్, మార్కెటింగ్, ప్రమోషన్లను కలుపుకుంటే ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8500 కోట్లు) కావడం విశేషం.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) నుంచి రాబోతున్న మూవీ అవెంజర్స్: డూమ్స్‌డే. ప్రస్తుతం దీనినే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మూవీగా చెబుతున్నారు. కేవలం మూవీ ప్రీప్రొడక్షన్ కోసం ఈ మధ్యే మేకర్స్ 80 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.68 కోట్లు ఖర్చు చేశారు.
ఈ సినిమాను నిర్మించడానికి మార్వెల్ స్టూడియోస్ కు 50 నుంచి 60 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యధిక బడ్జెట్ మూవీగా పేరుగాంచిన స్టార్ వార్స్ ఎపిసోడ్ IX (44.7 కోట్ల డాలర్లు) కంటే కూడా చాలా ఎక్కువే.
మార్వెల్ స్టూడియోస్ తమ సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వాటి మార్కెటింగ్, పబ్లిసిటీ కోసమూ భారీగానే ఖర్చు చేస్తుంది. ఆ లెక్కన సినిమా మొత్తం ఖర్చు 100 కోట్ల డాలర్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.8500 కోట్లు. మరో అవెంజర్స్ మూవీ సీక్రెట్ వార్స్ కోసం కూడా ఇంతే ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆ మూవీ ప్రొడక్షన్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ప్రస్తుతానికి డూమ్స్‌డే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూవీగా నిలవబోతోంది.
డూమ్స్‌డే మూవీ ఖర్చు భారీగా పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం వీఎఫ్ఎక్స్ పై భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువగా నటీనటులకు ఇచ్చే రెమ్యునరేషన్లు ఉండటం విశేషం. ఈ మూవీలో ఏకంగా 35 మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. వాళ్ల రెమ్యునరేషన్లు అన్నీ కలిపే ఏకంగా 25 కోట్ల డాలర్లకు చేరుతుందని వెరైటీ మ్యాగజైన్ వెల్లడించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.2100 కోట్లు.
అవెంజర్స్: డూమ్స్‌డే మూవీ కోసం ఇంత భారీగా ఖర్చు చేస్తుండటంతో అసలు ఈ సినిమాకు లాభాలు వస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో సక్సెస్ అయితే తప్ప సినిమాకు లాభాలు కష్టమే. డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు కాకుండా బ్రేక్ ఈవెన్ కోసమే ఈ మూవీ 100 కోట్ల డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అంతకంటే తక్కువైతే నష్టాలే.
అది అంత సులువైన పని కాదనే చెప్పాలి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కు ఇది మొత్తంగా 39వ సినిమా కాగా.. అవెంజర్స్ ఫ్రాంఛైజీలో 5వ మూవీ. ఇందులో క్రిస్ హెమ్స్‌వర్త్, సెబాస్టియన్ స్టాన్, వానెస్సా కిర్బీ, ఆంథోనీ మాకీ, పాల్ రుడ్, వ్యాట్ రసెల్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ 26న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్