మీకు పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అంటే ఇష్టమా? బ్రేక్ డ్యాన్స్ తెగ నచ్చేస్తుందా? అయితే ఇప్పుడు ఓటీటీలోకి తెలుగులోనూ రాబోతున్న ఈ మలయాళం మూవీ మిస్ కాకుండా చూడండి. మూన్‌వాక్ అనే ఈ మూవీ తెలుగు ట్రైలర్ శుక్రవారం (జులై 4) రిలీజైంది. ఈ ట్రైలర్ నవ్వులు పంచుతూనే.. కేరళలోని గ్రామీణ ప్రాంతాల్లోని యువత అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్ కూడా చూపించింది.
మలయాళం మూవీ మూన్‌వాక్ (Moonwalk) ఈ ఏడాది మే 30న థియేటర్లలో రిలీజైంది. మైఖేల్ జాక్సన్ పాపులర్ డ్యాన్స్ మూవ్ పేరునే ఈ సినిమాకు పెట్టారు. ఇప్పుడీ సినిమా జులై 8 నుంచి జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. సుమారు రెండు నిమిషాల ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగా సాగింది.
కేరళలోని ఓ చిన్న ఊళ్లో బతుకుతెరువు కోసం ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపే కొందరు యువకులు.. బ్రేక్ డ్యాన్స్ పై ఇష్టంతో సొంతంగా నేర్చుకుంటూ ఉంటారు. సిటీ యువతకు తాము ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవడానికి అక్కడి కాంపిటీషన్లలో పాల్గొనాలని భావిస్తారు. ఆ యువకుల ఆశ నెరవేరిందా లేదా అన్నదే ఈ మూన్‌వాక్ మూవీ స్టోరీ. ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించింది.
'మూన్‌వాక్' కథ నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒకప్పటి పాప్ సామ్రాజ్యపు రాజు మైఖేల్ జాక్సన్ స్ఫూర్తితో బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవాలని కలలు కనే యువకుల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్కూల్‌కు వెళ్తూ లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ యువకులు డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులను అధిగమిస్తారో ఈ మూవీలో చూపించారు. ఒక కాంపిటీషన్ లో పాల్గొనడానికి డ్యాన్స్ స్టెప్స్‌ని పక్కాగా నేర్చుకోవడానికి వారు పడే కష్టాన్ని కూడా ఇందులో చూడొచ్చు. ఇది 1980ల నాటి కేరళలోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో సాగే కథనం.
ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి థియేటర్లలో విడుదల చేశారు. ఎ.కె. వినోద్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ యూత్ గ్రూప్ ద్వారా 'మూన్‌వాక్' సినిమా పరిశ్రమకు ఒక కొత్త స్ఫూర్తిని తీసుకువస్తుందని లిజో ఒక ప్రమోషన్ వీడియోలో చెప్పారు. 'మూన్‌వాక్'లో ప్రధాన నటులలో ఎక్కువ మంది కొత్తవాళ్లే. షేర్షా షరీఫ్, అనునాథ్, రిషి కైనిక్కర, సిద్ధార్థ్ బి, మనోజ్ మోసెస్, సుజిత్ ప్రభాకర్, నైనిత మరియా, శ్రీకాంత్ మురళి, మీనాక్షి రవీంద్రన్, అర్జున్ మణిలాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
స్క్రీన్‌ప్లేను ఎ.కె. వినోద్, మాథ్యూ వర్గీస్, సునీల్ గోపాలకృష్ణన్ కలిసి రాశారు. డ్యాన్స్ లవర్స్ తోపాటు మైఖేల్ జాక్సన్ ను అమితంగా ఆరాధించే ప్రేక్షకులకు ఈ మూన్‌వాక్ మూవీ బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఇంకేం జులై 8 నుంచి జియోహాట్‌స్టార్ లో ఈ సినిమాను చూడటానికి సిద్ధంగా ఉండండి.
సంబంధిత కథనం