OTT: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హీరోయిన్ గుజ‌రాతీ రొమాంటిక్‌ మూవీ - ఎందులో చూడాలంటే?-monal gajjar gujarati romantic comedy movie vaar tahevaar streaming now on amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హీరోయిన్ గుజ‌రాతీ రొమాంటిక్‌ మూవీ - ఎందులో చూడాలంటే?

OTT: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హీరోయిన్ గుజ‌రాతీ రొమాంటిక్‌ మూవీ - ఎందులో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Nov 21, 2024 06:11 AM IST

టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన గుజ‌రాతీ మూవీ వార్ తాహేవార్ ఓటీటీలోకి వ‌చ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో సుడిగాడు, అల్లుడు అదుర్స్‌తో పాటు ప‌లు సినిమాలు చేసింది మోనాల్ గ‌జ్జ‌ర్‌.

ఓటీటీ
ఓటీటీ

OTT: టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన గుజ‌రాతీ మూవీ వార్ తాహేవార్ ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వార్ తాహేవార్ మూవీలో ప‌రీక్షిత్‌ త‌మాలియా హీరోగా న‌టించ‌గా...చిన్మ‌య్ పురోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో...

ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ రొమాంటిక్ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. మోనాల్ గ‌జ్జ‌ర్ యాక్టింగ్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. పెళ్లి విష‌యంలో నేటిత‌రం ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌కు అద్ధంప‌డుతూ ద‌ర్శ‌కుడు చిన్మ‌య్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

వార్ తాహేవార్ క‌థ ఇదే...

ప్రీత‌ల్ (మోనాల్ గ‌జ్జ‌ర్‌), శుభ్ (ప‌రీక్షిత్‌)...జీవితంలో బాగా డ‌బ్బు సంపాదించిన త‌ర్వాతే పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉంటారు. కెరీర్‌లో నిల‌దొక్కుకునే వ‌ర‌కు ప్రేమ‌, పెళ్లి లాంటి బంధాల‌కు త‌మ జీవితంలో చోటు ఉండ‌కూడ‌ద‌ని ఫిక్స‌వుతారు. ప్రీత‌ల్‌, శుభ్‌ల‌కు పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యించుకుంటారు. కానీ ప్రీత‌ల్‌, శుభ్ మాత్రం పెద్ధ‌ల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తారు.

పెళ్లి చేసుకోవ‌డానికి ఒప్పుకోరు. అనుకోని ప‌రిస్థితుల్లో శివ్‌, శివానీ అనే జంట పెళ్లికి క‌లిసి ప్రీత‌ల్‌, శుభ్ అటెండ్ కావాల్సివ‌స్తుంది. ఈ వివాహం కార‌ణంగా వారి ఆలోచ‌న‌ల్లో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి? ప్రేమ‌, పెళ్లితో పాటు కుటుంబ బంధాల విలువ‌ను ఎలా తెలుసుకున్నారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సుడిగాడుతో హీరోయిన్‌గా...

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన సుడిగాడు మూవీతో హీరోయిన్‌గా మోనాల్ గ‌జ్జ‌ర్ సినీ కెరీర్ ఆరంభ‌మైంది. సెటైరిక‌ల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 32 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఆ త‌ర్వాత తెలుగులో వెన్నెల వ‌న్ అండ్ హాఫ్, బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి, దేవ‌దాసి, అల్లుడు అదుర్స్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. సుడిగాడు మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ ఫ్లాపులుగా నిల‌వ‌డంతో టాలీవుడ్‌కు దూర‌మైంది మోనాల్ గ‌జ్జ‌ర్‌. కొన్నాళ్లుగా గుజ‌రాతీ భాష‌లో సినిమాలు చేస్తోంది.

బిగ్‌బాస్ ఫైన‌ల్‌

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న మోనాల్ గ‌జ్జ‌ర్ ఫైన‌ల్ చేరుకున్న‌ది. 98వ రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. టైటిల్ రేసులో చివ‌రి వ‌ర‌కు నిలిచిన మోనాల్ గ‌జ్జ‌ర్‌కు ఫైన‌ల్ వీక్‌లో నిరాశ మిగిలింది. తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోస్ డ్యాన్స్ ఐకాన్‌, డ్యాన్స్ ప్ల‌స్‌ల‌కు మోనాల్ గ‌జ్జ‌ర్ జ‌డ్జ్‌గా ప‌నిచేసింది.

Whats_app_banner