L2 Empuraan Day 1 box office: భారీ అంచనాల మధ్య రిలీజైన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎల్2: ఎంపురన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకూ ఏ మలయాళం సినిమాకు సాధ్యం కాని రీతిలో తొలి రోజే ఇండియాలోనే రూ.21 కోట్లు వసూలు చేసిందీ మూవీ.
మలయాళం సినిమా అంటే తక్కువ బడ్జెట్.. ఆ స్థాయికి తగిన వసూళ్లు. చాలా దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడి నుంచి కూడా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. ఇవి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉన్నాయి. తాజాగా మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్2: ఎంపురన్ మూవీ తొలి రోజే ఇండియాలో రూ.21 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గతేడాది పృథ్వీరాజే నటించిన ది గోట్ లైఫ్ రూ.8.9 కోట్లతో క్రియేట్ చేసిన రికార్డును ఈ మూవీ బ్రేక్ చేసింది.
అంతకుముందు మోహన్ లాలే నటించిన లూసిఫర్ రూ.6.1 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా రికార్డులన్నీ తెరమరుగయ్యాయి. ట్రేడ్ ట్రాకర్ Sacnilk ప్రకారం.. తొలిరోజు మలయాళంలో ఎల్2: ఎంపురన్ ఆక్యుపెన్సీ 60 శాతంగా ఉంది. కొచ్చి, కోళికోడ్ లాంటి ప్రాంతాల్లో అయితే 90 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇవి మోహన్ లాల్ కు బాగా ఫాలోయింగ్ ఉన్న ప్రాంతాలు.
గడిచిన కొన్ని దశాబ్దాలుగా మలయాళం సినిమాలు కంటెంట్ పరంగానే ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేవి. బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ సాధించేవి కావు. 2019 వరకు ఒక్క మలయాళం మూవీ కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. లూసిఫర్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక రూ.200 కోట్ల మార్క్ అయితే కేవలం మంజుమ్మెల్ బాయ్స్ మాత్రమే అందుకుంది.
తాజాగా వచ్చిన ఎల్2: ఎంపురన్ ఆ రికార్డును తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ వీకెండ్ రానుండటం కూడా సినిమాకు కలిసి రానుంది. అయితే మిక్స్‌డ్ రివ్యూలు రావడం కాస్త మేకర్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది. రెండో రోజు బుకింగ్స్ నిరాశాజనకంగానే ఉన్నాయి. అయితే మూడో రోజైన శనివారం నుంచి వరుసగా మూడు రోజులు ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ఈ ఎల్2: ఎంపురన్ వచ్చింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లోనూ రిలీజైంది. 2019లో వచ్చిన లూసిఫర్ కు ఇది రెండో భాగం. మూడో భాగం కూడా రావాల్సి ఉంది. అయితే లూసిఫర్ కు వచ్చిన రెస్పాన్స్ మాత్రం దీనికి రాలేదు. ఈ మూవీలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, ఇంద్రజీత్ సుకుమారన్, మంజు వారియర్ లాంటి వాళ్లు నటించారు.
సంబంధిత కథనం