L2: Empuraan Controversy: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఎల్: ఎంపురాన్ మూవీ రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ సినిమాలో గోద్రా అల్లర్లు, విలన్ పేరుపై తీవ్ర దుమారం రేగింది. సినిమాలో కొన్ని కీలకమైన సీన్లను 3 నిమిషాల పాటు కట్ చేసినా వివాదం మాత్రం ఆగడం లేదు. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ ఈ మూవీని తాను చూడబోనని స్పష్టం చేశారు.
కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఎల్2 ఎంపురాన్ మూవీ వివాదంపై స్పందించారు. తాను ఇప్పటి వరకూ ఈ మూవీ చూడలేదని, ప్రస్తుతం నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇక చూడబోనని స్పష్టం చేశారు. “నేనింకా సినిమా చూడలేదు. ప్రీక్వెల్ లూసిఫర్ చూశాను. అదో మంచి థ్రిల్లర్ మూవీ. ఆ సినిమాను ఎంజాయ్ చేశాను. నేను మోహల్ లాల్ కు పెద్ద అభిమానిని.
ఈ సీక్వెల్ కూడా చూస్తానని గతంలో చెప్పాను. ఓ సినిమాను సినిమాగా చూడాలన్న పార్టీ నిర్ణయం కూడా మారదు. ఈ సినిమా ఏమీ చరిత్ర కాదు. అందువల్ల ప్రతి ఒక్కరికీ ఈ సినిమా చూసే హక్కుతోపాటు దీనిని ఇష్టపడే, విమర్శించే హక్కు కూడా ఉంది” అని రాజీవ్ అన్నారు.
ఈ ఎల్2: ఎంపురాన్ మూవీని సానుకూలంగా లేదా ప్రతికూలంగా మరీ ఎక్కువగా విశ్లేషించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. “చాలా మందికి ఈ సినిమా నచ్చలేదు. కొందరికి నచ్చింది. సినిమాను సినిమాలాగా చూడాలి. మరీ లోతుగా చూడాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమాపై ఎలాంటి అభిప్రాయం లేదు. అయితే వివాదాల కారణంగా ఈ సినిమా చూడకూడదని నేను నిర్ణయించుకున్నాను” అని రాజీవ్ స్పష్టం చేశారు.
“మోహన్ లాల్ ఇలాంటి సినిమా తీయడం మిమ్మల్ని బాధించిందా అని ఎవరో అడిగారు. నేను అవునని చెప్పాను. అంతే. ఒకవేళ పినరయి విజయన్ కు సినిమా నచ్చితే పదిసార్లు చూడమనండి తప్పులేదు. సినిమా నచ్చని వారికి దానిని విమర్శించే హక్కు కూడా ఉంటుంది” అని రాజీవ్ అన్నారు.
వివాదాల నేపథ్యంలో ఈ ఎల్2: ఎంపురాన్ సినిమాకు కేరళ సీఎం పినరయి విజయన్ మద్దతు లభించింది. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన అతిపెద్ద మారణహోమాల్లో ఒకదాని గురించి సినిమాలో చూపించడం సంఘ్ పరివార్ ను ఆగ్రహానికి గురి చేసినట్లుంది అని పినరయి అన్నారు. అటు కాంగ్రెస్ కూడా ఈ సినిమాకు అండగా నిలిచింది.
ఇక మలయాళం స్టార్ హీరో ఆసిఫ్ అలీ కూడా ఈ వివాదంపై స్పందించాడు. సినిమాను కేవలం వినోదంగా మాత్రమే చూడాలని అతను అన్నాడు. తమ అభిప్రాయాలను ధైర్యంగా బయటకు చెప్పలేని వాళ్లే ఇలా రాళ్లు వేస్తారని అతడు అభిప్రాయపడ్డాడు. అటు మోహన్ లాల్ కూడా ఈ సినిమాపై నెలకొన్న వివాదంపై స్పందిస్తూ క్షమాపణ చెప్పాడు.
ఎల్2: ఎంపురాన్ సినిమాకు తొలి సో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. లూసిఫర్ తో పోలిస్తే ఈ సినిమా అస్సలు బాగాలేదని అభిమానులు కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ వివాదం కూడా సినిమాకు నెగటివ్ పబ్లిసిటీని తీసుకొచ్చింది. అయితే ఇవేవీ ఈ మూవీ బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపలేదు.
పైగా ఈ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. తొలి వీకెండ్ ఏకంగా రూ.80 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ ఎల్2: ఎంపురాన్ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయగా.. మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించాడు. గతంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్.
సంబంధిత కథనం