MM Keeravani: 38 ఏళ్ల తర్వాత లేడీస్ టైలర్ జోడీ రిపీట్.. ఇళయరాజా దర్శకత్వంలో పాట రాసిన ఎంఎం కీరవాణి!
MM Keeravani Written Song In Ilayaraja Music Direction: సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి పాట రాశారు. 38 ఏళ్ల తర్వాత లేడీస్ టైలర్ మూవీ జోడీ మరోసారి రిపీట్ కానుంది. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్స్‌గా నటించిన షష్టిపూర్తి మూవీ వివరాల్లోకి వెళితే..!
MM Keeravani Ilayaraja For Shashtipoorthi Movie: రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా 'షష్టిపూర్తి'. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణంగా నటిస్తోంది. క్లాసిక్ ఫిల్మ్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది.
కీరవాణి సాహిత్యం
ఇందులో రూపేష్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటించింది. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని 'ఏదో ఏ జన్మ లోదో' సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు. 'ఏదో... ఏ జన్మలోదో... ఈ పరిచయం' సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే.. ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించగా ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సాహిత్యం సమకూర్చారు.
లక్కీగా చెన్నైలో ఉన్నారు
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ''మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. చైతన్య ప్రసాద్ గారు కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే ఓ పాటకు కీరవాణి గారు అయితే బావుంటుందని అనిపించింది. చైతన్య ప్రసాద్ గారికి కీరవాణి గారు క్లోజ్. ఆయన ద్వారా అప్రోచ్ అయ్యాము. లక్కీగా ఆ టైంలో కీరవాణి గారు చెన్నైలో ఉన్నారు. లంచ్ టైంలో వెళ్లి కలిశాము'' అని అన్నారు.
స్టూడియోకు తిరిగి వచ్చేసరికి
''సిట్యువేషన్ చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా ఓకే అన్నారు. మేం స్టూడియోకు తిరిగి వచ్చేసరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసి ఇచ్చారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఇది మా చిత్ర బృందం చేసుకున్న అదృష్టం'' అని డైరెక్టర్ పవన్ ప్రభ తెలిపారు.
ఇదే మొదటిసారి
''కీరవాణి గారు ఇప్పటివరకూ 60 పై చిలుకు పాటలు రాశారు. కానీ, ఇళయరాజా గారి బాణీకి రాయడం ఇదే ప్రథమం. అది కూడా కీరవాణి గారు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రాయడం ఇంకా విశేషం '' అని షష్టిపూర్తి దర్శకుడు పవన్ ప్రభ పేర్కొన్నారు.
కుటుంబ బంధాలు, విలువలు
సినిమా హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ''ఇళయరాజా సంగీతం, కీరవాణి సాహిత్యంతో కూడిన పాట మా సినిమాలో ఉండటం కంటే ఇంకేం కావాలి? ఈ అవకాశం హీరోగా, నిర్మాతగా నాకు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ పాట అందరికీ నచ్చుతుంది. మిగతా పాటలూ బాగా వచ్చాయి. కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది'' అని తెలిపారు.
త్వరలో రిలీజ్ డేట్
''రాజేంద్ర ప్రసాద్, అర్చన వంటి సీనియర్ హీరో హీరోయిన్లతో నటించడం నాకొక లెర్నింగ్ ప్రాసెస్ అండ్ బ్లెస్సింగ్. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని హీరో రూపేష్ చెప్పుకొచ్చారు.