Mirzapur Season 3 Twitter Review: మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ నాలుగేళ్లుగా ఎదురు చూశారు. తొలి రెండు సీజన్లు ఎంతో రక్తి కట్టించడంతో ఈ మూడో సీజన్ ఇంకో రేంజ్ లో ఉంటుందని ఆశించారు. ప్రైమ్ వీడియో కూడా ఊరించి ఊరించి శుక్రవారం (జులై 5) ఈ కొత్త సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కానీ ఇది తీవ్రంగా నిరాశ పరిచిందని ఫ్యాన్స్ అంటున్నారు.
2018లో వచ్చిన మీర్జాపూర్ తొలి సీజన్ కాస్త హింస ఎక్కువైనా ఎంతో థ్రిల్లింగా సాగి మెప్పించింది. 2020లో వచ్చిన రెండో సీజన్ దాని కంటే కాస్త నెమ్మదించినా.. ఫర్వాలేదనిపించింది. కానీ మూడో సీజన్ కు వచ్చేసరికి ఇందులో అసలు మజానే లేదని ఫ్యాన్స్ అంటున్నారు. రెండో సీజన్ తోనే మున్నా భయ్యా (దివ్యేందు శర్మ) పాత్ర ముగియడంతో మూడో సీజన్ చాలా బోరింగా సాగిందంటూ ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారు.
హింస ఎక్కువ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని కామెంట్ చేస్తుండటం విశేషం. రెండో సీజన్ లో ప్రాణాలతో బయటపడిన కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠీ) ఈ మూడో సీజన్ లో తాను కోల్పోయిన మీర్జాపూర్ సింహాసనం కోసం మళ్లీ వస్తాడని, ఇది ఎంతో ఆసక్తిగా ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాలీన్ భయ్యా, గుడ్డూ భయ్యా, బీనా త్రిపాఠీ (రసికా దుగల్), గోలు (శ్వేతా త్రిపాఠీ) ఉన్నా.. మున్నాను బాగా మిస్ అయినట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.
అర్ధరాత్రి నుంచే ఈ మీర్జాపూర్ మూడో సీజన్ రావడంతో శుక్రవారం ఉదయానికి చాలా మంది ఈ కొత్త సీజన్ చూసేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ లో చాలా వరకు నెగటివ్ గానే ఉన్నాయి. "మొత్తానికి చాలా తక్కువ అంచనాలతో మీర్జాపూర్ సీజన్ 3 చూడటం పూర్తి చేశాను.
మీర్జాపూర్ సింహాసనం కోసం సాగిన రాజకీయాలకు పది ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్ గంటపాటు అవసరం అయ్యాయి. చాలా బోరింగా ఉంది. అయితే చివరి రెండు ఎపిసోడ్లు, క్రెడిట్స్ పడిన తర్వాత వచ్చే సీన్ మరో సీజన్ పై ఆసక్తి రేపింది" అని ఓ అభిమాని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
"అన్నింటి కంటే బలహీనమైన సీజన్ ఇదే. అసలు ఏమీ లేదు. చెప్పడానికి స్టోరీ లేక అనవసరమైన సీన్లు, పాత్రలతో నడిపించారు. తొలి ఎపిసోడ్ బాగుంది. తర్వాత మూడు ఎపిసోడ్లు వేస్ట్. ఐదో ఎపిసోడ్ చూడండి. గతంలోని ముఖ్యమైన పాత్రలను పక్కన పెట్టేశారు" అని మరో అభిమాని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఇక మరో అభిమాని స్పందిస్తూ.. "మీర్జాపూర్ 3 నాకేనా మిగిలిన వాళ్లకు కూడా బోరింగా అనిపించిందా? అనవసరంగా లాగారు. డైలాగ్స్ బాగాలేవు. ఈ కాలంలో ఇలాంటి షోలు అసలు స్టోరీ లైన్ ను పట్టించుకోవడం లేదు" అని అనడం విశేషం.
సీజన్ 3 ముగిసిన తర్వాత వచ్చే సీన్ చూస్తుంటే నాలుగో సీజన్ కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే సీజన్ 3 నిరాశ పరచడంతో నాలుగో సీజన్ కోసం ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తారో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.