కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్న కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇది నా సక్సెస్ మీట్‌లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ల మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది" అని అన్నారు.
"ఇక్కడకి నేను గెస్ట్‌గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. నాగార్జున గారు ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు. కుబేర గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎక్కడో డిఫరెంట్‌గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పారు" అని చిరు తెలిపారు.
"నేను కుబేర సినిమా చూశాను. నాగార్జున చెప్పింది 100% కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను (నాగార్జున) మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున గారు ఒప్పుకొని చేయడం ఇదే ఫస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నాను" అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.
"దేవ క్యారెక్టర్‌లో ధనుష్‌ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్‌ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్‌పీరియన్స్‌లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది" అని చిరంజీవి వెల్లడించారు.
"ఒక్కొక్క సినిమాని ఆణిముత్యం లాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు శేఖర్ కమ్ముల. స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ముల నన్ను ఓ అభిమానిలా కలిశారు. ఆరోజే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది" అని చిరు తెలిపారు.
"ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకి (శేఖర్ కమ్ముల) మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. శేఖర్ కమ్ముల సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాలో పాత్రలు కూడా దేవ, దీపక్ అనే గుర్తు పెట్టుకుంటాం" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
"నాగ్ అనుకున్నట్లుగా ఇది ఆయనకి మరో డోర్ ఓపెన్ అయింది. మరిన్ని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఆయనకి వస్తాయి. ఆయన దోవలో కూడా నేను వస్తానని అనుకుంటున్నాను" అని చిరంజీవి కామెంట్స్ చేశారు.
సంబంధిత కథనం