Rohit Sharma: వాళ్ల నోళ్లు మూయించాల్సింది ఇలాగే: రోహిత్ శర్మపై మెగాస్టార్ ప్రశంసల వర్షం
Rohit Sharma: రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్.. విమర్శకులకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

Rohit Sharma: రోహిత్ శర్మ వన్డేల్లో సుమారు 16 నెలల తర్వాత సెంచరీ చేయడంతో అతనిపై ఇప్పుడు అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అయితే రోహిత్ ను ఆకాశానికెత్తాడు. విమర్శకుల నోళ్లు మూయాల్సింది ఇలాగే అని బిగ్ బీ అనడం విశేషం. తన బ్లాగ్ లో టీమిండియా కెప్టెన్ గురించి ఎంతో విలువైన మాటలు రాశాడు.
రోహిత్ సరిగ్గా అలాగే నోళ్లు మూయించాడు: అమితాబ్
తనను విమర్శిస్తున్నవారికి ఎప్పుడైనా అంచనాలకు మించి రాణించి సమాధానం చెప్పాలని, రోహిత్ అదే చేశాడని అమితాబ్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. "మనం నిల్చొన్న కాళ్లు.. అవి తిరిగే నేల.. అందుకోసం తిరిగిన దూరం.. చివరికి వాటికి కావాల్సిన మసాజ్ చేస్తే.. ఇన్నేళ్లూ ఏం మిస్సమయ్యామో మనకు తెలుస్తుంది.
ప్రధాన ఈవెంట్లో కాస్త తగ్గినా.. క్రికెట్ లో మాత్రం బ్రిట్స్ కు సాహసోపేతమైన దెబ్బ కొట్టాడు. అత్యద్భుతం. అంచనాలను మించి రాణించడమే విమర్శకుల నోళ్లు మూయించడానికి ఉన్న ఏకైక మార్గం. రోహిత్ అదే చేశాడు" అని బిగ్ బీ అన్నాడు. ఇదే బ్లాగ్ లో మనిషి మెదడుకు ఉన్న సామర్థ్యం గురించి కూడా అమితాబ్ కవితాత్మకంగా వర్ణించాడు.
రోహిత్ శర్మ సెంచరీ
ఎన్నో నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతూ విమర్శల పాలవుతున్న రోహిత్ శర్మ.. మొత్తానికి సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలుసు కదా. ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో 90 బంతుల్లోనే 119 రన్స్ చేశాడు. వన్డేల్లో అతనికిది 32వ సెంచరీ కావడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ ఫామ్ లోకి రావడం అభిమానులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్లలో రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ను వెనక్కి నెట్టాడు.
రోహిత్ శర్మ దూకుడుతో సులువుగా గెలిచిన టీమిండియా.. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ఎగరేసుకుపోయింది. చివరిదైన మూడో వన్డే బుధవారం (ఫిబ్రవరి 12) జరగనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను 4-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం