Mechanic Rocky Review: మెకానిక్ రాకీ రివ్యూ - విశ్వక్‌సేన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Mechanic Rocky Review: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Mechanic Rocky Review: కెరీర్ ఆరంభం నుంచి హీరోగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యతను చాటుకుంటోన్నాడు విశ్వక్‌సేన్. థ్రిల్లర్ కథతో విశ్వక్‌సేన్ చేసిన తాజా మూవీ మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? ఈ మూవీతో కొత్త దర్శకుడు రవితేజ విశ్వక్‌సేన్‌కు హిట్టు ఇచ్చాడా? లేదా? అంటే?
మెకానిక్ రాకీ కథ…
రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్‌సేన్) బీటెక్‌ను మధ్యలోనే ఆపేస్తాడు. మలక్‌పేటలో తండ్రి (నరేష్) నిర్వహించే ఆర్‌కే గ్యారేజెస్‌లో మెకానిక్‌గా పనిచేస్తూనే డ్రైవింగ్ పాఠాలు నేర్పుతుంటాడు. రాకీ గ్యారేజీ స్థలాన్ని దొంగ పత్రాలు సృష్టించి రంకిరెడ్డి (సునీల్) అనే రౌడీ ఆక్రమించుకోవాలని చూస్తాడు.
రంకిరెడ్డి నుంచి తన స్థలాన్ని కాపాడుకోవడానికి రాకీకి యాభై లక్షలు అవసరమవుతాయి. ఈ సమస్య నుంచి మాయ (శ్రద్ధా శ్రీనాథ్) సాయంతో గట్టెక్కాలని రాకీ అనుకుంటాడు. కాలేజీ రోజుల్లోనే రాకీ ప్రేమించిన ప్రియ (మీనాక్షి చౌదరి) మళ్లీ డ్రైవింగ్ పాఠాలు నేర్చుకోవడానికి రాకీ దగ్గరకు వస్తుంది. ప్రియ రీఎంట్రీతో రాకీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?
ప్రియకు రాకీ దూరమవ్వడానికి కారణం ఏమిటి? రాకీకి దక్కాల్సిన ఓ ఇన్సూరెన్స్ సొమ్ములో నామినీగా మరొకరు పేరు ఎందుకు ఉంది? ఆ పాలసీ ఎవరిది? రాకీ జీవితంలోకి మాయ ఎందుకొచ్చింది?రంకిరెడ్డి నుంచి తన గ్యారేజీని రాకీ కాపాడుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
కమర్షియల్ థ్రిల్లర్ మూవీ...
మెకానిక్ రాకీ ఫక్తు కమర్షియల్ అంశాలతో సాగే థ్రిల్లర్ మూవీ. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలను ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సీరియస్‌గా చెబుతుంటారు. మరికొందరు మాత్రం లవ్, రొమాన్స్, కామెడీ లాంటి అంశాలతో కమర్షియల్ దారిలో థ్రిల్లర్ కథలను చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మెకానిక్ రాకీ రెండో కోవకు చెందిన మూవీ.
విశ్వక్‌సేన్ ఇమేజ్...
సైబర్ క్రైమ్, ఇన్సూరెన్స్ మోసాలు అనే పాయింట్‌కు లవ్‌స్టోరీని, కామెడీ జోడించి రవితేజ ముళ్లపూడి ఈ కథను రాసుకున్నాడు. విశ్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఇమేజ్‌తో పాటు అతడి సినిమా నుంచి ఆడియెన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఊహించుకుంటూ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో టైమ్‌పాస్ చేస్తే...సెకండాఫ్ ట్విస్ట్‌లతో ఈ మూవీ థ్రిల్‌ను చేస్తుంది.
ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్...
సూసైడ్ సీన్‌తోనే కథను ఇంట్రెస్టింగ్‌గా మొదలుపెట్టారు డైరెక్టర్. ఆ తర్వాత మెకానిక్ రాకీగా విశ్వక్‌సేన్ పరిచయం, ప్రియతో అతడి ప్రేమాయణం, తండ్రీకొడుకుల బంధంపై వచ్చే పంచ్‌లు, ప్రాసలు సినిమా సరదాగా సాగిపోతుంది. లవ్ స్టోరీ నుంచి కూడా కామెడీనిరాబట్టడంలో దర్శకుడు కొంత సక్సెస్ అయ్యాడు.
సెకండాఫ్‌లోనే లవ్‌స్టోరీ అనుకున్న సినిమా కాస్త కంప్లీట్‌గా థ్రిల్లర్ జోనర్‌లో ఎంటర్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ వెనకున్న మరో కోణాన్ని చూపిస్తూ, ఒక్కో ప్రశ్నకు చిక్కుముడులను విప్పుతూ ట్విస్ట్‌లతో సెకండాఫ్‌ను గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. సైబర్ మోసాల గురించి దర్శకుడు టచ్ చేసిన పాయింట్ బాగుంది.
విశ్వక్‌సేన్ ఎనర్జీ...
రాకీ క్యారెక్టర్‌లో తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో విశ్వక్‌సేన్ మరోసారి అదరగొట్టాడు. ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సారి డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఇదివరకు చేయనటువంటి ఓ కొత్త పాత్రలో కనిపించింది. మీనాక్షి చౌదరి గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. విశ్వక్‌సేన్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. నరేష్, హర్షచెముడు, హర్షవర్ధన్‌తో పాటు మిగిలిన వారి నటన ఓకే అనిపిస్తుంది.
కామెడీ ప్లస్ థ్రిల్...
ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో వచ్చిన కమర్షియల్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్‌ను పంచుతూనే కామెడీతో మంచి టైమ్‌పాస్ చేస్తుంది.
రేటింగ్: 2.75/5
టాపిక్