MayaBazaar For Sale Review: ‘మాయాబజార్ ఫర్ సేల్’ సిరీస్ రివ్యూ.. ఆకట్టుకుందా?
MayaBazaar For Sale Review: జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి నేడు వచ్చిన ‘మాయాబజార్ ఫర్ సేల్’ సిరీస్ తొలి సీజన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.
నటీనటులు: నరేశ్, ఝాన్సీ, ఈశా రెబ్బా, మేయంగ్ చాంగ్, రవివర్మ, హరితేజ, నవ్‍దీప్, సునైనా, గౌతమ్ రాజు, అదితి మ్యాకల్, రాజు చెంబోలు తదితరులు; సంగీతం: జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్; డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: నవీన్ యాదవ్; నిర్మాణం: స్పిరిట్ మీడియా (దగ్గుపాటి రానా); నిర్మాత: రాజీవ్ రంజన్; దర్శకురాలు: గౌతమి చల్లగుల్ల
MayaBazaar For Sale Review: తెలుగులో ఇటీవలి కాలంలో చాలా వెబ్ సిరీస్‍లు వస్తున్నాయి. అయితే, గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో సాగే అర్బన్ స్టైల్ సిరీస్‍లు తక్కువే. కాగా, ఆ నేపథ్యంతో ‘మాయా బజార్ ఫర్ సేల్’ అనే వెబ్ సిరీస్ నేడు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. తొలి సీజన్‍లో మొత్తంగా ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. మాయాబజార్ అనే గేటెడ్ కమ్యూనిటీలో జరిగే కథలతో ఇది సాగుతుంది. కామెడీ, లవ్, డ్రామా, కాస్త క్రైమ్ కూడా ఈ సిరీస్‍లో ఉంది. మరి ఈ మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.
కథ ఇలా..
పద్మనాభ శాస్త్రి - పాస్ట్రీ (నరేశ్) తన కూతురు వల్లి (ఇషా రెబ్బా), భార్య కుసుమ కుమారి - కుకు (ఝాన్సీ), కొడుకుతో కలిసి మాయాబజార్‌లోని గేటేడ్ కమ్యూనిటీలో విల్లా తీసుకొని వస్తారు. పాస్ట్రీ తమ్ముడు సుబ్బు (గౌతమ్ రాజు) ఆవుతో వచ్చి రచ్చరచ్చ చేస్తాడు. ఈ విల్లాలకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న హీరో అభిజిత్ (నవ్‍దీప్) విల్లాల ఓపెనింగ్‍కు వచ్చి భవనంపై నుంచి పడి చనిపోతాడు. అలాగే మాయాబజార్ గేటెడ్ కమ్యూనిటీ అక్రమ స్థలంలో కట్టారన్న ఆరోపణలు వస్తాయి. వల్లీ.. సుధీమ్ (మేయంగ్ చాంగ్) అనే నార్త్ ఈస్ట్ అబ్బాయి ప్రేమలో పడుతుంది. అసలు నవ్‍దీప్ చనిపోయేందుకు కారణమేంటి? మాయాబజార్ విల్లాస్ సమస్య తీరిందా? వల్లీ ప్రేమ సక్సెస్ అయిందా? అన్నదే ‘మాయా బజార్ ఫర్ సేల్’ అసలు కథ.
ఎలా సాగిందంటే..
‘మాయాబజార్ ఫర్ సేల్’ ప్రారంభం నుంచే నవ్విస్తుంది. చిక్కడపల్లిలో ఉండే పద్మనాభ శాస్త్రి కుటుంబం మాయాబజార్ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలోకి రావడం నుంచి సరదాగా సాగిపోతుంది. నవ్‍దీప్ చనిపోయే వరకు పూర్తి కామెడీగా రన్ అవుతుంది. ఆ ట్విస్టు తర్వాత కాస్త సీరియస్‍గా మారినట్టు కనిపించినా మళ్లీ కామెడీ ట్రాక్‍లోకి వస్తుంది. ప్రతీ ఎపిసోడ్ చివర చిన్న ట్విస్ట్ ఉండేలా.. ఆసక్తి రేకెత్తించేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ప్రారంభం నుంచి ఆవు (కౌసల్య) చూట్టూ జరిగే సంఘటనలు సరదాగా అనిపిస్తాయి. ఈ ఆవుకు యాంకర్ సుమ వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రత్యేకతగా ఉంది. పద్మనాభ శాస్త్రి తమ్ముడు సుబ్బు కాసేపు కనిపించినా కథను మలుపుతిప్పే క్యారెక్టర్ అతడిది.
సుబ్బు మీద కోపంతో అక్రమంగా విల్లాలను నిర్మించారని మాయాబజార్ మీద కక్ష కడతాడు సీసీడీఏ కమిషనర్ (శివ నారాయణ). ఆ తర్వాత జరిగే డ్రామా కూడా సరదాగానే సాగుతుంది. అయితే, ఆ కమిషనర్ ఎందుకు మనసు మార్చుకునే విషయం కాస్త గాబరాగా ఉంటుంది. ఇక, వల్లీ.. సుదీమ్ గొగొయ్ అనే నార్త్ ఈస్ట్ అబ్బాయితో లవ్‍లో పడుతుంది. ఈ లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. విల్లా ఓనర్ గాంధీ (రవివర్మ), అతడి భార్య సరిత (హరితేజ) కన్నింగ్‍గా కనిపించారు. విజ్జీ (అదితి మ్యాకల్), ఆమె భర్త ఓ పాపను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక వైభవ్ (రాజా చెంబోలు), సుధ (సునైన), ప్రియాంక (హారిక వేదుల) సంసారం గొడవలు అలరించకపోగా.. కథకు కాస్త స్పీడ్ బ్రేకర్లుగా అనిపిస్తాయి.
మాయాబజార్ గేటెడ్ కమ్యూనిటీ ఎన్నికలు.. వల్లీ, సుధీమ్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటాయి. విల్లాను కాపాడుకునేందుకు, కూతురి ప్రేమను అంగీకరించాలో తెలియక పద్మనాభ శర్మ పడే కంగారు సరదాగా అనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని ఇక్కడి ప్రజలు సాధారణంగా ఎలా చూస్తారో డైరెక్టర్ ఈ సీజన్‍లో చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా అయితే, ‘మాయా బజార్ ఫర్ సేల్’ సిరీస్ కామెడీ ప్రధానంగా సాగిపోతుంది. పద్మనాభ శాస్త్రి కుటుంబానిదే ప్రధానమైన కథగా ఉంటుంది. కొన్ని వేరే కథలను చూపించినా.. వాటికి పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడా కథనం కాస్త స్లో అయినట్టు అనిపించినా మొత్తంగా చూస్తే ఈ సిరీస్ సరదాగా సాగిపోతుంది. వీకెండ్‍లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. డైలాగ్స్, ఎమోషన్లు కూడా ఈ సిరీస్‍లో మెప్పిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
‘మాయా బజార్ ఫర్ సేల్’లో పద్మనాభ శాస్త్రి పాత్రలో నరేశ్ అద్భుతంగా చేశారు. కొన్ని సందర్భాల్లో కంగారు పడుతూనే కామెడీ పండించారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతానని మరోసారి నిరూపించారు. ఝాన్సీ కూడా తనకు సూటయ్యే పాత్రలో బాగా చేశారు. తాను ఎంత సహజంగా నటించగలనో ఈ సిరీస్‍తో మరోసారి నిరూపించుకుంది ఈశా రెబ్బా. వల్లీ పాత్రలో అదరగొట్టింది. ఇక సుధీమ్ గొగొయ్ పాత్ర చేసిన మియాంగ్ చాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు తన నటనతో ఆకట్టుకున్నాడు. నవ్‍దీప్ కాసేపే కనిపించాడు. అదితి, రవివర్మ, హరితేజ, సునైన, గౌతమ్ రాజు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ డైరెక్టర్ వంశీధర్ ఈ సిరీస్‍లో తన నటనతో ఉన్నంత సేపు నవ్వించాడు. సీనియర్ యాక్టర్ కోటా శ్రీనివాస రావు చిన్న పాత్రలో కనిపించారు.
‘మాయా బజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ తొలి సీజన్ ఆకట్టుకునే విధంగానే సాగింది. అయితే, కొన్ని చోట్ల మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. కథనం మరింత గ్రిప్పింగ్‍గా ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేది. దర్శకురాలు గౌతమి.. పద్మనాభ శాస్త్రి కుటుంబంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో.. మిగిలిన వారి కథలు పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కావు. అయితే, కామెడీ సీన్లు మాత్రం బాగా పండాయి. ఎలక్షన్స్ చుట్టూ మరింత డ్రామా క్రియేట్ చేసి ఉంటే మరింత ఫన్‍గా ఉండేది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
మొత్తంగా.. ‘మాయా బజార్ ఫర్ సేల్’ సిరీస్ ఫస్ట్ సీజన్ ఓవరాల్‍గా ఆకట్టుకుంటుంది. సరదాగా కుటుంబంతో కలిసి సిరీస్ చూడాలనుకుంటే ఇది మంచి ఆప్షన్‍గా నిలుస్తుంది. క్లీన్ కామెడీ, మంచి డైలాగ్‍లతో మెప్పిస్తుంది. ఆలోచింపజేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. చక్కగా టైమ్‍పాస్ అవుతుంది.
రేటింగ్: 3/5