Max Movie Review: మ్యాక్స్ రివ్యూ - కిచ్చా సుదీప్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Max Movie Review: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మ్యాక్స్ మూవీ క్రిస్మస్ సందర్భంగా తెలుగులో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Max Movie Review: కన్నడంలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు కిచ్చా సుదీప్. మాస్ కథలతో కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. మరోసారి తనకు అచ్చొచ్చిన మాస్ ఫార్ములాతో కిచ్చా సుదీప్ చేసిన మూవీ మ్యాక్స్.
విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. మ్యాక్స్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే?
మ్యాక్స్ మూవీ…
అర్జున్ మహాక్షయ్ అలియాస్ మాక్స్ (కిచ్చా సుదీప్) నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. కళ్ల ముందు తప్పు జరిగితే అస్సలు సహించడు. ఎదుట ఉన్నది ఎంతటి వాడైన తాటతీయాల్సిందేఅన్నది మాక్స్ సిద్ధాంతం. ముక్కుసూటితనం వల్ల సస్పెండ్ అవుతాడు. సస్పెన్షన్ ముగిసి తెల్లారితే డ్యూటీలో జాయిన్ కావాల్సిన టైమ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగిన ఇద్దరు మినిస్టర్స్ కుమారులను మాక్స్ అరెస్ట్ చేస్తాడు.
అనుకోకుండా ఆ ఇద్దరు మినిస్టర్ కొడుకులు పోలీస్ స్టేషన్‌లోనే మరణిస్తారు. వాళ్లు ఎలా చనిపోయారు? పోలీస్ స్టేషన్‌లో ఉన్న మంత్రుల కుమారులను విడిపించేందుకు వచ్చిన రౌడీలను మ్యాక్స్ తో పాటు మిగిలిన పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు?
ఇన్స్‌పెక్టర్ రూప (వరలక్ష్మి శరత్‌కుమార్), గ్యాంగ్‌స్టర్ గని (సునీల్)కారణంగా మ్యాక్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మినిస్టర్ కొడుకుల మర్డర్ కేసు నుంచి మ్యాక్స్‌తో పాటు మిగిలిన పోలీసులు ఎలా బయటపడ్డారన్నదే మ్యాక్స్ మూవీ కథ.
హీరోయిజానికి చిరునామా...
ఖాకీ కథలు సిల్వర్ స్క్రీన్‌పై మాస్, హీరోయిజానికి చిరునామాగా నిలుస్తాయి. పోలీస్ పాత్రలు లిమిట్‌లెస్ యాక్షన్, రఫ్ క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్‌తో డిఫరెంట్‌గా సాగుతాయి. పోలీస్ పాత్రల్లో ఉంటే కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే అడపాదడపా స్టార్ హీరోలు ఖాకీ క థల్లో నటించడానికి ఆసక్తిని చూపుతుంటారు. మ్యాక్స్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత కిచ్చా సుదీప్ ఖాకీ కథను టచ్ చేశారు.
ఒక్క రోజులో...
మ్యాక్స్ మూవీ కథ మొత్తం ఒక్క రాత్రిలోనే ఓ పోలీస్ స్టేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. కథ పరంగా చూసుకుంటే సింపుల్ పాయింట్. సుదీప్‌కు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న యాక్షన్ ఇమేజ్‌ను వాడుకుంటూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో దర్శకుడు మ్యాజిక్ చేశాడు.
ఒక్కో యాక్షన్ ఎపిసోడ్‌ను ఒక్కో రేంజ్‌లో చూపిస్తూ ప్రేక్షకులకు హై మూవ్‌మెంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్‌పై రౌడీలు ఎటాక్ చేసే సీన్స్... వాటిని సుదీప్ టీమ్ తిప్పికొట్టే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి.
ఎలివేషన్స్...
మాక్స్ ఇంట్రడక్షన్ సీన్‌తోనే సుదీప్‌లోని హీరోయిజం, ఎలివేషన్స్ సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటాయో దర్శకుడు హింట్ ఇచ్చేశాడు. మినిస్టర్ కొడుకుల అరెస్ట్...ఆ తర్వాత జరిగే పరిణామాలతో సినిమా కాస్తంత స్లో అయినట్లుగా అనిపిస్తుంది.
పోలీస్ స్టేషన్‌లోనే ఆ మినిస్టర్స్ కొడుకులు చనిపోయినప్పటి నుంచి కథ గ్రాఫ్ మారిపోతుంది. ఊహలకు అందని మలుపులతో చివరి సీన్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను కలిగిస్తూ స్టోరీని నడిపించాడు డైరెక్టర్.
మెయిన్ ట్విస్ట్ రివీలయ్యే సీన్‌తో పాటు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అనిపిస్తాయి. విలన్ అండ్ గ్యాంగ్ వేసే ఎత్తులను హీరో చిత్తు చేసే సీన్స్‌ను దర్శకుడు ఫ్రెష్‌గా రాసుకున్నాడు. క్రైమ్ నుంచి హీరో ఎలాగైనా బయటపడితే బాగుండుననే టెన్షన్‌ను బిల్డప్ చేసుకోవడం, ఓ చిన్న సెంటిమెంట్ పాయింట్ టచ్ చేసిన తీరు బాగున్నాయి.
లోకేష్ కగనరాజ్ ఫార్ములా
మ్యాక్స్ మూవీతో లోకేష్ కనగరాజ్ ఫార్ములాను ఫాలో అయ్యాడు డైరెక్టర్ విజయ్ కార్తికేయ. కొన్ని చోట్ల మాక్స్ మూవీ కార్తి ఖైదీని తలపిస్తుంది. ఓ చిన్న పాయింట్‌ను తీసుకొని దర్శకుడు మాక్స్ కథను రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ తర్వాతే క్లైమాక్స్ ఏమిటన్నది అర్థమైపోతుంది. హీరోకు ధీటైన విలన్ పాత్ర సినిమాలో కనిపించదు.
స్టైలిష్ పోలీస్ ఆఫీసర్...
మ్యాక్స్ పాత్రలో కిచ్చా సుదీప్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టాడు. తన మ్యానరిజమ్స్‌తో మెప్పించాడు. గ్యాంగ్‌స్టర్‌గా సునీల్ విలనిజం బాగుంది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మరో హీరోగా నటించాడు. యాక్షన్ సీన్స్‌లో అతడి ఇచ్చిన బీజీఎమ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
ప్రాపర్ కమర్షియల్ మూవీ...
మ్యాక్ ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. మాస్ ఆడియెన్స్‌కు విందు భోజనంలా ఈ మూవీ ఉంటుంది.
రేటింగ్:3/5