Matka OTT: ఓటీటీలోకి మట్కా వచ్చేది అప్పుడే.. వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు మిక్స్‌డ్ రెస్పాన్స్
Matka OTT: మట్కా మూవీ గురువారం (నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్న ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ్ నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.
Matka OTT: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ థియేటర్లలో రిలీజైంది. అయితే రిలీజ్ కు ముందు నుంచి కూడా పెద్దగా బజ్ లేని ఈ మూవీకి రిలీజైన తర్వాత కూడా మిక్స్‌డ్ టాకే నడుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మరి మూవీ ఈ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్న ఆసక్తి నెలకొంది.
మట్కా ఓటీటీ రిలీజ్ డేట్
వరుణ్ తేజ్ లీడ్ రోల్లో నటించిన మట్కా మూవీ డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాను ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనుంది. ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ప్రేక్షకుల నుంచే కాకుండా రివ్యూల్లో మిక్స్‌డ్ రెస్పాన్స్ ఉండటంతో అంతకుముందు కూడా ఓటీటీలోకి అడుగుపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
మట్కా మూవీకి తెలుగులోనూ కంగువ నుంచి గట్టి పోటీ ఉంది. అటు దీపావళికి రిలీజైన క, అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలకు కూడా ఇప్పటికీ బాగానే క్రేజ్ ఉండటంతో మట్కా బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోవడం కాస్త కష్టంగానే ఉంది.
మట్కా మూవీ స్టోరీ ఏంటంటే?
మట్కా మూవీలో వరుణ్ తేజ్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. 1958 నుంచి 1982 మధ్య కాలంలో నడిచిన స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. వాసు (వరుణ్ తేజ్) అనే వ్యక్తి కటిక పేదరికం నుంచి మట్కా గ్యాంబ్లింగ్ ద్వారా ఎలా కోటీశ్వరుడు అవుతాడన్నది ఈ సినిమా కథ. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నెరేటివ్ విషయంలో తడబడటంతో అభిమానుల నుంచి నెగటివ్ టాక్ వస్తోంది.
చిన్నతనంలోనే ఓ శరణార్థిగా తన తల్లితో కలిసి విశాఖపట్నంలో అడుగుపెట్టే వాసు.. తర్వాత చిన్న చిన్న నేరాలు చేస్తూ జైలుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో గ్యాంబ్లింగ్ లోకి దిగి మట్కా కింగ్ గా ఎదుగుతాడు. వాసు పాత్రలో వరుణ్ తేజ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నా.. ఊహించగలిగే స్టోరీ లైన్ తో మట్కా మూవీ పెద్దగా థ్రిల్ చేయలేకపోయింది.
ఇలాంటి స్టోరీలతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి స్టోరీని ఎలివేట్ చేసేలా కూడా ఎలాంటి ఎలిమెంట్స్ ఇందులో లేవు. అయితే మట్కా గ్యాంబ్లింగ్ కు సంబంధించిన కొన్ని సీక్వెన్స్ మాత్రం ఆసక్తి రేపుతాయి. ఇక వింటేజ్ లుక్, ఆ రోజుల్లోని స్టైల్ ను తెరపై ఆకట్టుకునేలా చూపడంలోనూ మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ మట్కా మూవీ బాక్సాఫీస్ వసూళ్లను బట్టి డిసెంబర్ మూడో వారం లేదా అంత కంటే ముందే ప్రైమ్ వీడియోలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.