Mathu Vadalara 2 Review: మత్తు వదలరా 2 రివ్యూ - టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ క్రైమ్ కామెడీ సీక్వెల్ ఎలా ఉందంటే?
Mathu Vadalara 2 Review: శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన మత్తు వదలరా 2 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మత్తు వదలరాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Mathu Vadalara 2 Review: 2019లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన మత్తు వదలరా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీకి దాదాపు ఐదేళ్ల తర్వాత మత్తు వదలరా 2 పేరుతో సీక్వెల్ వచ్చింది. శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి రితేష్ రానా దర్శకత్వం వహించాడు. శుక్రవారం ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
టీజర్, ట్రైలర్స్‌తో ఆకట్టుకోవడం, ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్, రాజమౌళితో పాటు పలువురు టాలీవుడ్ స్టార్లు పాల్గొనడంతో మత్తువదలరా 2పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్‌కు మించి మత్తు వదలరా 2 తెలుగు ఆడియెన్స్‌ను నవ్వించిందా? లేదా? అంటే?
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్...
డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా కోడూరి), ఏసుదాసు( సత్య) హీ టీమ్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా జాయిన్ అవుతారు. అడ్డదారుల్లో కిడ్నాప్ కేసులను డీల్ చేసే టీమ్‌లో భాగం అవుతారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో అక్కడ కూడా తమ తస్కరణ టాలెంట్‌ను చూపిస్తుంటారు. తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని దామిని (ఝాన్సీ) అనే మహిళ బాబు, ఏసులను సంప్రదిస్తుంది.
హీ టీమ్ ద్వారా కాకుండా తామే సొంతంగా ఈ కేస్‌ను డీల్ చేయాలని బాబు, ఏసు నిర్ణయించుకుంటారు. అనుకోకుండా రియా డెడ్‌బాడీ బాబు, ఏసు కారులోనే దొరుగుతుంది. ఈ ఇద్దరిని హంతకులుగా అనుమానించిన మైఖేల్ (సునీల్) వారిని వెంటాడుతుంటాడు? అసలు రియా ఎలా చనిపోయింది?
ఈ మర్డర్ కేసులో బాబు, ఏసులను ఇరికించింది ఎవరు? చనిపోయిన రియా నిజంగానే దామిని కూతురా? రియా హత్యకు సినీ హీరో యువ(వెన్నెలకిషోర్)కు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసులోకి నిధి ( ఫరియా అబ్లుల్లా ) ప్రకాష్ (అజయ్), దీప (రోహిణి) ఎలా వచ్చారు అన్నదే మత్తు వదలరా 2 మూవీ కథ.
సెటైరికల్ కామెడీ...
మత్తు వదలరా 2 సెటైరికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మర్డర్ మిస్టరీకి ఫన్‌ను జోడించి దర్శకుడు రితేష్ రానా ఈ సీక్వెల్ మూవీని తెరకెక్కించాడు. మలుపులతో ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడం కంటే నవ్వించడానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకు తగ్గట్లే కథ, క్యారెక్టరైజేషన్స్‌తో పాటు సీన్స్ రాసుకున్నాడు. సిట్యూవేషనల్ కామెడీతో పాటు యాక్టర్స్ సెన్సాఫ్ హ్యూమర్‌తోనే ప్రారంభం నుంచి ముగింపు వరకు డైరెక్టర్ టైమ్‌పాస్ చేశాడు.
బోర్ ఫీల్ రాకుండా...
మత్తు వదలరాకు కొనసాగింపుగానే సీక్వెల్‌ను మొదలుపెట్టారు డైరెక్టర్. హీ టీమ్‌లో బాబు, ఏసు జాయిన్ కావడం, తమ స్టైల్‌లో కిడ్నాప్ కేసులను పరిష్కరించే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. స్టార్ హీరోల స్ఫూఫ్‌లతో బోర్ ఫీల్ కలగనీయకుండా చేశాడు డైరెక్టర్.
పరుగులు పెట్టిన కథ...
కిడ్నాప్ కేసును సాల్వ్ చేసే క్రమంలో బాబు, ఏసు మర్డర్ కేసులో ఇరుక్కుకోవడం,తమను ప్లానింగ్‌తో కేసులో ఇరికించారని వారు తెలుసుకునే ట్విస్ట్‌లతో సెకండాఫ్‌లో కథను పరుగులు పెట్టించాడు డైరెక్టర్. ఫస్ట్ పార్ట్‌లోని డ్రగ్స్ హంగామాను ఇందులోను టచ్ చేశాడు. ఈ డ్రామా కన్వీన్సింగ్‌గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే అనిపిస్తుంది.
ఈజీగా గెస్ చేసేలా...
కామెడీ పరంగా మత్తు వదలరా బాగున్నా మెయిన్ క్రైమ్ ఎలిమెంట్‌ను దర్శకుడు ఆసక్తిగా రాసుకోనట్లుగా అనిపిస్తుంది. కథలోని ట్విస్ట్‌లు చాలా వరకు ఆడియెన్స్ ఈజీగా గెస్ చేసేలానే ఉంటాయి. సెకండాఫ్‌లో కథ ఎంతకు ముందుకు కదలక అక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే కామెడీ డోస్ కూడా చాలా తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. పంచ్‌లు, ప్రాసలు, స్ఫూఫ్‌లు పెద్దగా పేలలేదు.
సత్య కామెడీ, మేనరిజమ్స్...
మత్తు వదలరా 2 కు సత్య బిగ్గెస్ట్ పిల్లర్‌గా నిలిచాడు. హీరోహీరోయిన్లను తన కామెడీ, మేనరిజమ్స్‌తో డామినేట్ చేశాడు సత్య. అతడి క్యారెక్టర్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యింది. సిట్యువేషన్‌కు తగ్గట్లుగా సత్య వేసే పంచ్‌లు నవ్విస్తాయి. సత్య తర్వాత వెన్నెలకిషోర్ పాత్ర చక్కటి కామెడీని పండించింది.
బాబు మోహన్ పాత్రలో శ్రీ సింహా నటన ఒకే అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించింది. అజయ్, సునీల్, రోహిణి, రాజాతో పాటు సినిమాలో కనిపించే ప్రతీ క్యారెక్టర్ నుంచి చక్కటి ఫన్‌ను రాబట్టుకున్నాడు డైరెక్టర్.
నాన్‌స్టాప్ నవ్వులు
మత్తు వదలరా నవ్విస్తూనే థ్రిల్‌ను పంచే క్రైమ్ కామెడీ మూవీ. రెండు గంటల పది నిమిషాల నాన్‌స్టాప్ నవ్వులను పంచే మూవీ ఇది. కామెడీ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఈ సీక్వెల్ తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్: 3/5