Mass Jathara Glimpse: మరోసారి పోలీస్‌గా రవితేజ.. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్‌తో మాస్ జాతర గ్లింప్స్ అదుర్స్ (వీడియో)
Mass Jathara Glimpse Released On Ravi Teja Birthday: మాస్ మహారాజా రవితేజ బర్త్ డే సందర్భంగా న్యూ మూవీ మాస్ జాతర గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మరోసారి పోలీస్‌గా రవితేజ అదరగొట్టాడు. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్‌తో వింటేజ్ రవితేజను చూపించారు. బీజీఎమ్‌తో మాస్ జాతర గ్లింప్స్ అదిరిపోయింది.
Mass Jathara Glimpse Released On Ravi Teja Birthday: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
రవితేజ బర్త్ డే సందర్భంగా
ఇప్పటికే విడుదలైన మాస్ జాతర ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా మాస్ జాతర గ్లింప్స్ విడుదల అయింది. జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా 'మాస్ జాతర' గ్లింప్స్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది.
తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ, ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్‌గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతోంది.
ఇడియట్ డైలాగ్
రవితేజ సినీ ప్రస్థానంలో ఇడియట్ మూవీలోని "మనదే ఇదంతా" అనే డైలాగ్ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. మాస్ జాతర గ్లింప్స్‌లో ఈ డైలాగ్ స్పెషల్ హైలెట్‌గా నిలిచింది. ఇది అభిమానులను మళ్లీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాగే, వెంకీ మూవీలోని ట్రైన్ బాత్రూమ్‌లో రవితేజ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కూడా మాస్ జాతర గ్లింప్స్‌లో ఆకట్టుకుంది.
ఇలా పాత సినిమాల్లోని డైలాగ్, హావాభావాలతో వింటేజ్ రవితేజను చూపించినట్లు అయింది. దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా 'మాస్ జాతర' గ్లింప్స్‌ను మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకు అంతలా చేరువయ్యారో ఈ గ్లింప్స్ మరోసారి రుజువు చేస్తోంది.
అదిరిపోయిన బీజీఎమ్
ఇక సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. కేసీపీడీ, ర్యాంప్ అంటూ వచ్చే బీజీఎమ్ సీన్స్‌కు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్‌కు ప్రధాన బలంగా ఆ బీజీఎమ్ నిలిచింది.
'మాస్ జాతర' చిత్రాన్ని మాసివ్ ఎంటర్టైనర్‌గా మలచడానికి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు.
సంబంధిత కథనం