Martin Luther King OTT: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన సంపూర్ణేశ్ ‘మార్టిన్ లూథర్ కింగ్’- ఓటు పవర్‌ను చెప్పే సినిమా-martin luther king movie streaming started on sony liv ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Martin Luther King Ott: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన సంపూర్ణేశ్ ‘మార్టిన్ లూథర్ కింగ్’- ఓటు పవర్‌ను చెప్పే సినిమా

Martin Luther King OTT: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన సంపూర్ణేశ్ ‘మార్టిన్ లూథర్ కింగ్’- ఓటు పవర్‌ను చెప్పే సినిమా

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 28, 2023 04:19 PM IST

Martin Luther King OTT Release: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ముందు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. వివరాలివే..

మార్టిన్ లూథర్ కింగ్ మూవీ పోస్టర్
మార్టిన్ లూథర్ కింగ్ మూవీ పోస్టర్

Martin Luther King OTT Release: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాకు ప్రశంసలు దక్కాయి. అక్టోబర్ 17వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ మూవీ మండేలాకు రీమేక్‍గా తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ తెరకెక్కింది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా.. ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రానికి మాటలు, స్క్రీన్‍ప్లే సమకూర్చి.. కథను తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా.. ఈ చిత్రానికి ప్రశంసలు లభించాయి. కాగా, మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

మార్టిన్ లూథర్ కింగ్ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు నేడు అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమ్ అవుతోంది. నవంబర్ 29న మార్టిన్ లూథర్ కింగ్‍ను తీసుకురానున్నట్టు సోనీ లివ్ గతంలో ప్రకటించగా.. ఒక్కరోజు ముందే నేడు అందుబాటులోకి వచ్చేసింది.

మార్టిన్ లూథర్ కింగ్ సినిమా.. ఓటు విలువను తెలిజెప్పేలా ఉంది. ఓటు ఎంత శక్తిమంతమైనదో చెబుతుంది. పొలిటికల్ సెటైర్ మూవీగా ఈ చిత్రం వచ్చింది. కామెడీతో సాగుతూనే ఎమోషనల్‍గా, ఆలోచింపజేసే విధంగా ఈ మూవీ ఉంది. ఓటు కోసం ఇద్దరు రాజకీయ నాయకులు.. మార్టిన్ లూథర్ కింగ్ (సంపూర్ణేశ్ బాబు)ను ప్రలోభాలకు గురి చేస్తారు. అప్పటి వరకు అనామకుడిగా ఉన్న అతడి చుట్టూ తిరుగుతారు. దీంతో మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అతడు ఏం చేశాడన్నదే ఈ మూవీ ప్రధానమైన కథగా ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో రెండు రోజుల్లో (నవంబర్ 30న) ఉండగా.. సందర్భానికి అనుగుణంగా ఓటు విలువను తెలియజేప్పే మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది.

మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించగా.. శరణ్య ప్రదీప్, నరేశ్, వెంకటేశ్ మహా కీలకపాత్రలు పోషించారు. వెంకటేశ్ మహా క్రియేటివ్ ప్రొడ్యూజర్‌తో పాటు స్క్రీన్‍ప్లే, మాటలు కూడా అందించారు. ఈ సినిమాలో ఆయన ముఖ్యమైన పాత్ర కూడా చేశారు. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు. 

WhatsApp channel