మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, తమిళ నటుడు, ఆర్చరీ కోచ్ షిహాన్ హుస్సైనీ (60) మరణించారు. బ్లడ్ క్యాన్సర్‌తో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ నేడు (మార్చి 25) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ గురువుగా వ్యవహించారు హుస్సైనీ. ఆయన మృతి పట్ల పవన్ స్పందించారు.
పవన్ కల్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు అని ఉండేది. అయితే, కరాటే శిక్షణ ఇచ్చే సమయంలో కల్యాణ్ పేరుకు పవన్ అని జతచేసింది హుస్సైనీనే. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ అని పేరు మారింది. తన గురువును పవన్ ఎంతో గౌరవించేవారు. ఆయన మరణంతో తీవ్ర వేదనకు లోనయ్యానంటూ నేడు సంతాపం ప్రకటించారు పవన్.
మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణవార్త తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానంటూ నేడు ఓ లేఖ వెల్లడించారు పవన్ కల్యాణ్. ఆయన అనారోగ్యంతో ఉన్నారని తనకు నాలుగు రోజుల కిందటే తెలిసిందని పేర్కొన్నారు. విదేశాలకు పంపి మెరుగైన చికిత్స చేయించాలని కూడా ఆలోచించినట్టు వెల్లడించారు. ఈనెల 29వ తేదీన చెన్నైకు వెళ్లి హుస్సైనీని పరామర్శించాలనుకున్నానని, ఇంతలోనే ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్.
తనకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు ముందుగా నిరాకరించిన షిహాన్ హుస్సైనీ ఆ తర్వాత అంగీకరించారని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆయని శిక్షణలో బ్లాక్‍బెల్ట్ సాధించానని తెలిపారు. తమ్ముడు సినిమాలో కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకునేందుకు హుస్సేని ఇచ్చిన శిక్షణ ఎంతో తోడ్పడిందని పేర్కొన్నారు. మరణం తర్వాత తన దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని ఆయన చెప్పారని, ఇది ఆయన ఆలోచన దృక్పథానికి అద్దం పడుతోందని తెలిపారు. హుస్సైనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పవన్ కల్యాణ్.
1986లో పున్నగై మనన్న చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు షిహాన్. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు. విజయ్ నటించిన బద్రి చిత్రంతో నటుడిగా హుస్సైనీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీలో చాలా మందికి శిక్షణ ఇచ్చారు హుస్సైనీ. ఆయన శిక్షణలో సుమారు మూడు వేల మంది మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్‍బెల్ట్ సాధించారని పవన్ తన లేఖలో తెలిపారు. ఆర్చరీ కోచ్‍గానూ హుస్సైనీ చాలా పేరొందారు. హుస్సైనీ మృతిపై కోలీవుడ్ ప్రముఖులు చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం