Market Mahalakshmi OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్యూటీఫుల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Market Mahalakshmi OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోంది బ్యూటీఫుల్ లవ్ స్టోరీ మార్కెట్ మహాలక్ష్మి. కేరింత ఫేమ్ పార్వతీశం నటించిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Market Mahalakshmi OTT Release Date: ఓటీటీలోకి మరో లవ్ స్టోరీ వచ్చేస్తోంది. క్లాస్ అబ్బాయి, మాస్ అమ్మాయి మధ్య ప్రేమకథను అందంగా చూపించిన మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. కేరింత మూవీ ద్వారా పేరు తెచ్చుకున్న పార్వతీశం, ప్రణీకాన్విక నటించిన ఈ సినిమా రెండున్నర నెలల తర్వాత ఓటీటీలో రానుంది.
మార్కెట్ మహాలక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్
ఈ మార్కెట్ మహాలక్ష్మి మూవీ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (జులై 1) ఆహా ఓటీటీ వెల్లడించింది. ఈ సినిమా వచ్చే గురువారం (జులై 4) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. "మార్కెట్ మహాలక్ష్మి.. మూవీ మరికొన్ని రోజుల్లో వస్తోంది. జులై 4న మార్కెట్ మహాలక్ష్మి ప్రీమియర్" అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసింది.
మహాలక్ష్మి ప్రేమకథ..
పార్వతీశం సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. సొంతకాళ్లపై ఇండిపెండెంట్‌గా బతికే అమ్మాయి తనకు భార్యగా రావాలని కలలు కంటాడు. హీరో తండ్రి (కేదార్ శంకర్) మాత్రం కట్నం ఎక్కువగా ఇచ్చే పిల్లతోనే అతడి పెళ్లి జరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్వతీశానికి ఓ రోజు కూరగాయల మార్కెట్‌లో మహాలక్ష్మి (ప్రణీకాన్వికా) కనబడుతుంది.
కూరగాయలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకుకుంటుంది మహాలక్ష్మి. ఆమె తెగువ, ఆలోచనావిధానం నచ్చి తొలిచూపులోనే మహాలక్ష్మితో పార్వతీశం ప్రేమలో పడతాడు. మహాలక్ష్మినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతాడు. మహాలక్ష్మి మాత్రం అతడి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తుంది.
పార్వతీశం ప్రేమను మహాలక్ష్మి ఎందుకు రిజెక్ట్ చేసింది? మహాలక్ష్మి కుటుంబనేపథ్యమేమిటి? మహాలక్ష్మి ప్రేమ కోసం పార్వతీశం ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? హీరో ప్రేమను కాదన్న పార్వతీశం తండ్రి కొడుకు మంచి మనసును ఎలా అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నదే మార్కెట్ మహాలక్ష్మీ మూవీ కథ.
పెళ్లి విషయంలో యువతరం ఆలోచనలు ఎలా ఉంటున్నాయనే పాయింట్‌తో దర్శకుడు వీఎస్ ముఖేష్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆడపిల్లలకు ఇండిపెండెంట్‌గా బతికే స్వేచ్ఛ ఉండాలనే సందేశాన్ని ఈ మూవీలో చూపించారు.
కేరింత మూవీతో ఎంట్రీ..
మార్కెట్ మహాలక్ష్మీ మూవీలో కేదార్ శంకర్, హర్షవర్ధన్, ముక్కు అవినాష్, భాష కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌గా ప్రణీకాన్వీకాకు ఇదే మొదటి మూవీ. కేరింత మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పార్వతీశం. దిల్‌రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
ఆ తర్వాత నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే మంచి చౌకబేరమ్ తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. అవేవీ అతడికి విజయాల్నితెచ్చిపెట్టలేకపోయాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు పార్వతీశం.