OTT Action Thriller: ఓటీటీలో దూకుడు కొనసాగిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది
Bhaiyya Ji OTT Streaming: ఓటీటీలో భయ్యా జీ సినిమా జోరు చూపిస్తోంది. మనోజ్ బాజ్‍పేయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ఆరంభం నుంచి భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో మరో మైలురాయి దాటింది. ఇప్పటికీ ఈ మూవీ టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
విలక్షణ నటుడు, బాలీవుడ్ సీనియర్ స్టార్ మనోజ్ బాజ్‍పేయ్ 100వ సినిమా ‘భయ్యా జీ’ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అపూర్వ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రాగా.. అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లు రాలేదు. అయితే, ఓటీటీలో మాత్రం భయ్యా జీ సినిమా భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. నెలైనా ఇంకా ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. తాజాగా మరో మైలురాయిని ఈ చిత్రం అధిగమించింది.
300 మిలియన్ దాటి..
భయ్యా జీ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా 300 మిలియన్ వాచ్ మినిట్స్ మైల్‍స్టోన్ దాటింది. నెలలోనే ఈ భారీ మైలురాయిని దాటి ఈ చిత్రం సత్తాచాటింది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ నేడు (ఆగస్టు 26) ప్రకటించింది. 300 మిలియన్ వాచ్ మినిట్స్ పోస్టర్ కూడా తీసుకొచ్చింది.
భయ్యా జీ సినిమా జీ5 ఓటీటీలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ మూవీకి ఈస్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఓటీటీల్లో మనోజ్ బాజ్‍పేయ్ స్టామినాను ఈ చిత్రం మరోసారి నిరూపించింది. “భయ్యాజీ ఎంట్రీ.. మా వ్యూవర్‍షిప్ సెంచరీ! 300 మిలియన్ నిమిషాలు, సెలెబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. మనోజ్ బాజ్‍పేయ్ 100వ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది” అని జీ5 ఓటీటీ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వచ్చి నెలైనా ఇంకా టాప్‍లోనే..
భయ్యా జీ సినిమా జూలై 26వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆరంభం నుంచే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ వ్యూస్ దక్కించుకుంది. మూడో రోజుల్లోనే 100 మిలియన్ వాచ్ మినిట్స్ సొందం చేసుకుంది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. అయితే, ఈ చిత్రం వచ్చి నెలరోజులైనా ఇంకా ప్రస్తుతం జీ5 ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. ఇంకా దూకుడు కొనసాగిస్తోంది.
భయ్యా జీ సినిమా మంచి అంచనాలతో మే 24వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ రావటంతో పెద్దగా కలెక్షన్లు రాలేదు. మనోజ్ బాజ్‍పేయ్ యాక్టింగ్‍కు మరోసారి ప్రశంసలు దక్కాయి. రామ్ చరణ్ త్రిపాఠి అలియాజ్ భయ్యా జీ అనే లోకల్ గ్యాంగ్‍స్టర్ పాత్రలో యాక్షన్ మోడ్‍లో ఆయన అదరగొట్టారు. అయినా కలెక్షన్లు ఆశించినట్టు దక్కలేదు. కానీ జీ5 ఓటీటీలో మాత్రం ఈ చిత్రం అంచనాలను మించిపోతోంది.
భయ్యా జీ సినిమాలో మనోజ్‍తో పాటు భాగీరథి బాయ్ కదమ్, జోయా హుసేన్, జతిన్ గోస్వామి, సువీందర్ విక్కీ, విపిన్ శర్మ అభిషేక్ రంజన్, అచార్య అనంత్, ఆకాశ్ మఖిజా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు దర్శకుడు అపూర్వ్ సింగ్ కర్కి. ఈ మూవీని భానుశాలి స్టూడియోస్, ఎస్ఎస్ఓ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వినోద్ భానుశాలి, కమలేశ్ భాముశాలి, మనోజ్ బాజ్‍పేయ్, శబానా రజా, షహీల్ ఓస్వాల్, సమీక్ష ఓస్వాల్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించారు.