Manjummel Boys OTT Release: ఈ సూపర్ హిట్ మలయాళ సినిమాను పట్టించుకోని ఓటీటీలు.. కారణమేంటో తెలుసా?-manjummel boys ott release super hit malayalam movie still waiting for ott partner ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manjummel Boys Ott Release: ఈ సూపర్ హిట్ మలయాళ సినిమాను పట్టించుకోని ఓటీటీలు.. కారణమేంటో తెలుసా?

Manjummel Boys OTT Release: ఈ సూపర్ హిట్ మలయాళ సినిమాను పట్టించుకోని ఓటీటీలు.. కారణమేంటో తెలుసా?

Hari Prasad S HT Telugu
Mar 12, 2024 07:16 AM IST

Manjummel Boys OTT Release: మలయాళంలో ఈ మధ్యే రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ మంజుమ్మెల్ బాయ్స్. అయితే ఈ సినిమాను ఇప్పుడు ఏ ఓటీటీ పట్టించుకోవడం లేదు.

ఈ సూపర్ హిట్ మలయాళ సినిమాను పట్టించుకోని ఓటీటీలు.. కారణమేంటో తెలుసా?
ఈ సూపర్ హిట్ మలయాళ సినిమాను పట్టించుకోని ఓటీటీలు.. కారణమేంటో తెలుసా?

Manjummel Boys OTT Release: సినిమాలు థియేటర్లలో రిలీజ్ కు ముందే ఓటీటీలతో భారీ డీల్ కుదుర్చుకుంటున్న కాలం ఇది. కానీ మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమాపై ఏ ఓటీటీ ఆసక్తి చూపడం లేదు. దీనికి ఓ బలమైన కారణమే ఉంది.

మంజుమ్మెల్ బాయ్స్‌కు ఓటీటీ కరువు

నిజానికి మలయాళ సినిమాలకు ఈ మధ్య దేశవ్యాప్తంగా భాషలకు అతీతంగా మంచి క్రేజ్ ఉంది. అందులోనూ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మిగతా భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ హక్కులు పెద్ద మొత్తానికి అమ్ముడుపోవడం ఖాయం అని మనం అనుకుంటాం.

కానీ మంజుమ్మెల్ బాయ్స్ విషయంలో ఇది రివర్స్ లో ఉంది. ఈ సినిమాను కొనడానికి ఏ ఓటీటీ ముందుకు రావడం లేదు. దీనికి కారణం.. ప్రొడ్యూసర్లు డిమాండ్ చేస్తున్న భారీ మొత్తమే. ఈ సినిమాకు గరిష్ఠంగా అన్ని భాషలు కలిపి రూ.10.5 కోట్లు మాత్రం ఓటీటీలు ఆఫర్ చేశాయి. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం మూవీ హిట్ అవడంతో రూ.20 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీలు ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

మారిన ఓటీటీల తీరు

ఈ మధ్యకాలంలో ఓటీటీల తీరు కాస్త మారినట్లు కనిపిస్తోంది. పెద్ద పెద్ద సినిమాలను రిలీజ్ లకు ముందే కోట్లు పెట్టి కొనుగోలు చేయడం కొన్నిసార్లు వాళ్ల కొంప ముంచుతోంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాలు కూడా ఓటీటీల్లో బోల్తా పడుతున్నాయి. అందుకే బాక్సాఫీస్ దగ్గర సక్సెసైన సినిమాలు ఓటీటీల్లోనూ వర్కౌట్ అవుతాయని భావించలేమన్న ఆలోచనలో ఓటీటీలు ఉన్నాయి.

ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకుపైగా వసూలు చేసిన మంజుమ్మెల్ బాయ్స్.. ఓటీటీలో ఆ స్థాయిలో పని చేయకపోతే నష్టపోతామన్నది ఓటీటీల భయం. అందుకే మేకర్స్ అడుగుతున్న భారీ మొత్తాన్ని చెల్లించడానికి వెనుకాడుతున్నాయి. ఈ మలయాళ సినిమా ఎదుర్కొంటున్న చిత్రమైన పరిస్థితిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై స్పందించాడు.

"ప్రొడ్యూసర్లు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తుండటంతో మంజుమ్మెల్ బాయ్స్ ను కొనుగోలు చేయడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదు. అన్ని భాషలు కలిపి వచ్చిన అత్యధిక ఆఫర్ రూ.10.5 కోట్లు మాత్రమే. కానీ ఇది చాలా తక్కువ అని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. ఏడాది కిందట అయితే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటివి రూ.20 కోట్లకైనా సిద్ధమయ్యేవి. కానీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రెండు, మూడు నెలల తర్వాతగానీ ఓటీటీల్లో రిలీజ్ కు అనుమతి ఇవ్వడం లేదు. అలాంటప్పుడు వాటిని కొని లాభం లేదన్న ఆలోచనలో ఓటీటీలు ఉన్నాయి" అని శ్రీధర్ చెప్పాడు.

ఈ మధ్యకాలంలో ప్రేమలు, భ్రమయుగంలాంటి మలయాళ సినిమాలు మాత్రమే కాస్త మంచి ధరలకు ఓటీటీలకు అమ్ముడయ్యాయి. ఆడు జీవితం, ది గోట్ లైఫ్, వర్షాంగల్కు శేషంలాంటి పెద్ద మలయాళ సినిమాలు ఓటీటీ డీల్స్ కోసం తంటాలు పడుతున్నాయి. కొన్ని తమిళ సినిమాలదీ అదే పరిస్థితి. తెలుగులో హనుమాన్ విషయంలోనూ ఇదే జరుగుతోందని, అందుకే ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Whats_app_banner