Manjummel Boys OTT: మలయాళ సూపర్ హిట్ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యం! స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..
Manjummel Boys OTT Release: ముంజుమ్మల్ బాయ్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మరింత కాలం వేచిచూడాల్సిందే. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎప్పుడు వస్తుందో కూడా బజ్ నడుస్తోంది. ఆ వివరాలు ఇవే.
Manjummel Boys OTT: మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తూ దూసుకెళుతోంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మలయాళ మూవీ ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం చాలా ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. అయితే, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
మరింత కాలం వేచిచూడాల్సిందే!
మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటూ గతంలో సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై బజ్ నడిచింది. అయితే, ఆరోజున ఈ చిత్రం ఓటీటీలోకి రావడం లేదని తాజాగా సమాచారం వెల్లడైంది. మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
ఓటీటీలోకి ఎప్పుడు?
మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు ఇంకా థియేటర్లలో కలెక్షన్లు వస్తుండడం, తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‍ను ఆలస్యం చేయనునున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాను మే నెలలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు తెచ్చే అవకాశం ఉంది. మే మొదటి వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని తాజాగా బజ్ బయటికి వచ్చింది. ఏప్రిల్ 5న మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీలోకి రావడం లేదని, మేలో వస్తుందని మూవీ ఎనలిస్ట్ ఏబీ జార్జ్ కూడా ట్వీట్ చేశారు.
తెలుగులో థియేటర్లలోకి..
మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన ముంజుమ్మల్ బాయ్స్ మూవీ తెలుగులో విడుదల కానుంది. ఈ విషయంపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ మలయాళ బ్లాక్‍బాస్టర్ కోసం వేచిచూస్తున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం భారీస్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మలయాళ మూవీ ప్రేమలు తెలుగులోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
కలెక్షన్లలో రికార్డు
మంజుమ్మల్ బాయ్స్ చిత్రం రికార్డులను బద్దలుకొట్టింది. రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ సాధించిన తొలి మలయాళ మూవీగా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.216 కోట్ల వసూళ్లను సాధించింది. కేరళతో పాటు తమిళనాడులోనూ ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‍లోనూ మంచి కలెక్షన్లను సాధించింది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం మలయాళ ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్‌గా టాప్ ప్లేస్‍కు దూసుకెళ్లింది.
మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించగా.. పవర్ ఫిల్మ్స్ నిర్మించింది. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు చేశారు. తమిళనాడు కొడైకెనాల్‍లోని గుణ గుహలకు ఓ స్నేహితుల గ్రూప్ వెకేషన్‍కు వెళుతుంది. అందులోని ఓ యువకుడు ప్రమాదంలో పడతాడు. అతడిని కాపాడేందుకు మిగిలిన స్నేహితులు ప్రయత్నించడం, వారికి సవాళ్లు ఎదురవడం చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సంగీతం అందించగా.. షైజూ ఖాలిద్ సినిమాటోగ్రఫీ చేశారు.