కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు, కొందరు నటీనటులు ఏళ్లు, దశాబ్దాలు గడుస్తున్నా ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటారు. అలాంటి వాళ్లే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కవల పిల్లలు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఇప్పటి ముంబైలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మణిరత్నం తీసిన బాంబే మూవీలో ఈ పిల్లలు నటించారు. హృదయ్‌రాజ్, హర్ష అనే ఈ ఇద్దరు ఇప్పుడేం చేస్తున్నారు? చూద్దాం పదండి.
బాంబే మూవీ 1995లో రిలీజైంది. అంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట వచ్చిన సినిమా ఇది. ఆ మూవీ రిలీజ్ సమయానికి ఎనిమిదేళ్ల వయసు ఉంటుంది ఈ కవలలకి. క్యూట్ లుక్స్ తోనే కాదు తమ నటనతో వీళ్లు ఆకట్టుకున్నారు. వీళ్లు మన తెలుగు వాళ్లే. వీళ్లలో ఒకరి పేరు హృదయ్‌రాజ్ కాగా.. మరొకరు హర్ష. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు వీళ్లు. ఆ సినిమాలో కమల్ బషీర్, కబీర్ నారాయణ పాత్రలు పోషించారు. అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా జంటగా నటించగా.. వాళ్ల పిల్లలుగా వీళ్లు కనిపించారు.
వీళ్లలో కమల్ బషీర్ పాత్ర పోషించిన హృదయ్‌రాజ్ ఆ తర్వాత కూడా సినిమాల్లో కొనసాగాడు. తెలుగులో ప్రేమించుకుందాం రా, తమిళంలో కొంజం కాఫీ కొంజం కాదల్ సినిమాల్లో నటించాడు. అయితే హర్ష మాత్రం ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. అతడు అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నట్లు ఆ మధ్య హృదయ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి ఆ సినిమా కోసం 70 మంది కవలల్ని ఆడిషన్ చేసి చివరికి వీళ్లను ఎంపిక చేయడం విశేషం.
మణిరత్నం కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే మూవీ ఈ బాంబే. తెలుగులో బొంబాయిగా రిలీజైంది. ముంబైలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సాగే సినిమా ఇది. హిందూ, ముస్లింల మధ్య జరిగిన అల్లర్లలో ఎంతోమంది చనిపోయారు. ఆ కథకు ఓ హిందూ, ముస్లిం అబ్బాయి, అమ్మాయి ప్రేమకథను జోడించి బొంబాయి సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు మణిరత్నం.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హమ్మ హమ్మ, కన్నానులే, ఉరికే చిలుకా పాటలు 30 ఏళ్లవుతున్నా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇక క్లైమ్యాక్స్ లో వచ్చే బాంబే థీమ్ సాంగ్, మ్యూజిక్ మరో లెవెల్.
బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. అప్పట్లోనే కేవలం హిందీ వెర్షనే రూ.14 కోట్లు వసూలు చేయడం విశేషం. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీల్లో అవార్డులు అందుకుంది. బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది.
బాంబే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగులో అయితే యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూడొచ్చు. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో త్వరలోనే థగ్ లైఫ్ మూవీ రానున్న నేపథ్యంలో ఆ గొప్ప దర్శకుడి నుంచి వచ్చిన బాంబే లాంటి గొప్ప సినిమాను మరోసారి చూస్తే మంచిదే.
సంబంధిత కథనం