Mangalavaram Trailer: భయపెట్టేలా, ఉత్కంఠభరితంగా పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ సినిమా ట్రైలర్: చూసేయండి-mangalavaram movie trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mangalavaram Trailer: భయపెట్టేలా, ఉత్కంఠభరితంగా పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ సినిమా ట్రైలర్: చూసేయండి

Mangalavaram Trailer: భయపెట్టేలా, ఉత్కంఠభరితంగా పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ సినిమా ట్రైలర్: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 21, 2023 03:49 PM IST

Mangalavaram Trailer: మంగళవారం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్ సాగింది.

Mangalavaram Trailer: భయపెట్టేలా, ఉత్కంఠభరితంగా పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ సినిమా ట్రైలర్
Mangalavaram Trailer: భయపెట్టేలా, ఉత్కంఠభరితంగా పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ సినిమా ట్రైలర్

Mangalavaram Trailer: ‘మంగళవారం’ సినిమా టైటిల్‍తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఆర్ఎక్స్100 సినిమాతో సంచలన హిట్ కొట్టిన అజయ్ భూపతి.. మంగళవారం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఎక్స్100 భామ పాయల్ రాజ్‍పుత్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై చాలా ఆసక్తి నెలకొంది. కాగా, మంగళవారం సినిమా ట్రైలర్ నేడు (అక్టోబర్ 21) విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మంగళవారం మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..

ఓ గ్రామంలో గోడపై ప్రజలకు తరచూ రాతలు కనిపిస్తుంటాయి. అసలు అది రాస్తున్నదెవరని ఆరా తీస్తారు. ఈ తంతుతో మంగళవారం సినిమా ట్రైలర్ మొదలైంది. ఇక ఈ గ్రామంలో ప్రతీ మంగళవారం కొందరు చనిపోతుంటారు. తర్వాతి మంగళవారం ఎవరు చనిపోతారోనని గ్రామస్తులు తీవ్రంగా భయపడుతుంటారు. చావులను ఆపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. పాయల్ రాజ్‍పుత్ ఈ సినిమాలో కాలేజీ అమ్మాయిగా నటించారు. శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే, ఇవి కూడా కథలో భాగంగానే ఉన్నట్టు అర్థమవుతోంది. అసలు ప్రతీ మంగళవారం ఆ గ్రామంలో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? దాని వెనుక మిస్టరీ ఏంటి? అనేదే మంగళవారం సినిమా ప్రధాన కథగా ఉన్నట్టు అర్థమవుతోంది.

మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‍పుత్, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోశ్ శ్రవణ్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. హరర్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం రూపొందింది.

మంగళవారం సినిమా ట్రైలర్‌ ఆద్యంతం భయపెట్టేలా, ఉత్కంఠభరితంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పటికే చెప్పారు. మహా సముద్రం సినిమాతో పరాజయం చవిచూసిన అజయ్.. ఈ మూవీ పట్ల చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అలాగే, అజ్నీశ్ లోకనాథ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌కు పెద్ద బలంగా ఉంది. శివేంద్ర దాశరథి.. సినిమాట్రోగఫీ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తంగా ట్రైలర్‌తో మంగళవారం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

మంగళవారం సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. కాగా, ఈ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024