Manchu Manoj vs Manchu Vishnu: సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటది: మంచు బ్రదర్స్ మధ్య మరోసారి ట్వీట్స్ రచ్చ
Manchu Manoj vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. తన తండ్రి పాత మూవీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఈ ఇద్దరూ మళ్లీ రోడ్డున పడ్డారు.
Manchu Manoj vs Manchu Vishnu: మంచు బ్రదర్స్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా శుక్రవారం (జనవరి 17) మంచు విష్ణు ఓ ట్వీట్ చేయడం, దానికి మనోజ్ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందంటూ ఈ ఇద్దరూ తమ తండ్రి మోహన్ బాబు పాత సినిమాల్లోని వీడియోలను వాడుకోవడం గమనార్హం.

మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్
మొదట మంచు విష్ణు శుక్రవారం (జనవరి 17) ఓ ట్వీట్ చేశాడు. తన ఫేవరెట్ మూవీ రౌడీలోని ఫేవరెట్ డైలాగ్ ఇదే అంటూ మోహన్ బాబు వాయిస్ ఒకటి పోస్ట్ చేశాడు. అందులో రౌడీ మూవీలో అతడు చెప్పిన డైలాగ్ ఉంది. "సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది.
కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి మధ్య ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ" అనే డైలాగ్ వినిపిస్తుంది. ఇది అతడు పరోక్షంగా తన తమ్ముడు మంచు మనోజ్ గురించే చేశాడని అప్పుడే అభిమానులు భావించారు.
మంచు మనోజ్ కౌంటర్
ఊహించినట్లే దీనికి మంచు మనోజ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. విష్ణు గురించి, అతని కన్నప్ప గురించి పరోక్షంగా ట్వీట్ చేస్తూ విష్ణుకు కౌంటర్ ఇవ్వడం గమనార్హం. "కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారులాగా, సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా #VisMith అనే హ్యాష్‌ట్యాగ్ పోస్ట్ చేస్తూ.. అతని హాలీవుడ్ వెంచర్ అనే క్లూ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ట్వీట్ లో తన తండ్రి మోహన్ బాబు పాత సినిమాలోని మరో వీడియో క్లిప్ పోస్ట్ చేస్తూ కూడా ఇదే హ్యాష్‌ట్యాగ్ జోడించాడు. ఇది విష్ణు చేసిన ట్వీట్ కు కౌంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మంచు ఫ్యామిలీ విభేదాలు
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కొన్నాళ్లుగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. మంచు బ్రదర్స్ మధ్య ఫైట్, తన అన్న, తండ్రిపై మనోజ్ కామెంట్స్, మీడియా వ్యక్తిపై మోహన్ బాబు దాడి, తర్వాత కేసులతో ఈ ఫ్యామిలీ రచ్చకెక్కింది. కొన్నాళ్లుగా ఎవరూ నోరు మెదపకపోవడంతో అంతా సద్దుమణిగిందని భావించినా.. తాజాగా శుక్రవారం (జనవరి 17) విష్ణు, మనోజ్ మధ్య ట్వీట్ వార్ తో మళ్లీ రచ్చ మొదలైంది. ఇది ఎంత వరకు వెళ్తుందన్నది చూడాలి.