Manchu Family: ముదురుతున్న మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ నిరసన.. విష్ణుపై దొంగతనం ఫిర్యాదు!-manchu manoj protest at mohan babu home in jalpally and files complaint against manchu vishnu manchu family controversy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Family: ముదురుతున్న మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ నిరసన.. విష్ణుపై దొంగతనం ఫిర్యాదు!

Manchu Family: ముదురుతున్న మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ నిరసన.. విష్ణుపై దొంగతనం ఫిర్యాదు!

Sanjiv Kumar HT Telugu

Manchu Family Controversy Manoj Complaint Against Vishnu: మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకీ ముదురుతోన్నట్లు కనిపిస్తోంది. తన ఇంట్లోకి చొరబడి కారు లాక్కెళ్లాడని సోదరుడు విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు ఇంటి గేట్ ముందు మంచు మనోజ్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు.

ముదురుతున్న మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ నిరసన.. విష్ణుపై దొంగతనం ఫిర్యాదు!

Manchu Family Controversy Manoj Complaint Against Vishnu: టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తి వివాదం బుధవారం (ఏప్రిల్ 9) కొత్త మలుపు తిరిగింది. అన్న మంచు విష్ణు తన ఇంట్లోకి చొరబడి తన కారును లాక్కెళ్లాడని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

150 మందితో

తన కారు కనిపించడం లేదని, ప్రముఖ తెలుగు సినీ నటుడు అయిన తన అన్న విష్ణుపై అనుమానం ఉందని నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. "నా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1న రాజస్థాన్‌కు భార్యాపిల్లలతో వెళ్లాను. నేను లేని సమయంలో విష్ణు తన సుమారు 150 మంది అనుచరులతో అక్రమంగా నా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశాడు. నా భద్రతా సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా నా కారును కూడా ఎత్తుకెళ్లారు" అని మంచు మనోజ్ చెప్పారు.

అనంతరం హైదరాబాద్ శివారు ప్రాంతం పహాడీషరీఫ్‌లోని జల్ పల్లిలో మోహన్ బాబు ఇంట్లోకి చొరబడేందుకు మనోజ్ ప్రయత్నించారు. మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. అయితే, అందరినీ పోలీసులు దూరంగా ఆపేశారు. కానీ, మనోజ్‌ను మాత్రం ఇంటి వరకు అనుమతించారు.

మంచు మనోజ్ నిరసన

కాకపోతే మనోజ్ లోపలికి వెళ్లకుండా గేటు మూసేశారు. ఇంట్లోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపినట్లు సమాచారం. అలాగే, గేటు తెరవడానికి సిబ్బంది నిరాకరించడంతో అక్కడే బైఠాయించి మంచు మనోజ్ నిరసన వ్యక్తం చేశారు. మోహన్ బాబు ఇంటి ముందు కూర్చోని నిరసన చేపట్టారు మంచు మనోజ్.

ఈ సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. మోహన్ బాబు అభ్యర్థన మేరకు ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశామని, మనోజ్ అక్కడికి వచ్చినప్పుడు మోహన్ బాబు, విష్ణు ఇంట్లో లేరని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

హైకోర్టు అనుమతించింది

తన తండ్రి, సోదరుడితో తనకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని, అయితే జల్ పల్లి బంగ్లాలో ఉండే హక్కు తనకు ఉందని మనోజ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. "డిసెంబర్‌లో ఈ ఇంట్లోనే ఉండేందుకు హైకోర్టు అనుమతించింది. కానీ, వారు కోర్టును తప్పుదోవ పట్టించి స్టే తెచ్చుకున్నారు" అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో జరిగిన అవకతవకలపై మాత్రమే కుటుంబంతో వివాదం ఉందని మంచు మనోజ్ తెలిపారు. తాను విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని, ఆస్తుల కోసం కాదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, గత ఏడాది డిసెంబర్ నుంచి మనోజ్‌ను తన జల్ పల్లి ఇంట్లోకి వెళ్లకుండా మోహన్ బాబు అడ్డుకుంటున్నారు.

కొట్టడం, కైసు ఫైల్

తాను సంపాదించిన డబ్బుతో కొన్న ఆస్తిపై మనోజ్‌కు హక్కు లేదని మోహన్ బాబు వాదించారు. అనంతరం టీవీ రిపోర్టర్‌ను మోహన్ బాబు కొట్టడం, కేసు ఫైల్ అవ్వడం తెలిసిందే. ఫిబ్రవరి 3న మంచు మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఆస్తి వివాదంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు హాజరయ్యారు. కలెక్టర్ ఎదుటే వారు వాగ్వాదానికి దిగారు.

మనోజ్ తన ఆస్తిని ఆక్రమించుకున్నాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తాజాగా మోహన్ బాబు ఇంటి గేటు ముందు రోడ్డు మీద మంచు మనోజ్ బైఠాయించి నిరసన తెలుపుతున్నాడు. ఇలా రోజు రోజుకీ మంచు ఫ్యామిలీ వివాదం ముదురుతూ వస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం