Manchu Manoj on OTT: రాకింగ్ స్టార్, హీరో మంచు మనోజ్ ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. యాక్టింగ్‍కు బ్రేక్ ఇచ్చారు. వరుసగా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవటంతో ఆయన విరామం తీసుకున్నారు. అయితే, అహంబ్రహ్మాస్మి పేరుతో మంచు మనోజ్ మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీలోకి ఆయన అడుగుపెడుతున్నారు. ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా డిజిటల్‍లో ఎంట్రీ అవుతున్నారు మంచు మనోజ్. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో నేడు రిలీజ్ అయింది. రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ ప్రోమో ఉంది. వివరాలివే..
గేమ్‍షోతో తాను తిరిగి వచ్చేస్తున్నానంటూ నేడు ఓ ట్వీట్ చేశారు మంచు మనోజ్. “ప్రియమైన అభిమానుల కోసం తిరిగొస్తున్నా కొంచెం కొత్తగా.. సరికొత్తగా ర్యాంప్ ఆడించడానికి. యువర్ రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ విత్ ఏ గేమ్ షో” అని మనోజ్ ట్వీట్ చేశారు. మంచు మనోజ్ పునరాగమనానికి సంబంధించిన వీడియోను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ రిలీజ్ చేసింది. దీంట్లో మంచు మనోజ్ ఆసక్తికరమైన డైలాగ్స్ ఉన్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ తనను ఎత్తుకున్న ఫొటో కనిపించేలా మంచు మనోజ్ ఈ ప్రోమో వీడియోను మొదలుపెట్టారు. "నా ప్రపంచం సినిమా.. చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమే నా ప్రొఫెషన్‍గా మారింది. నన్ను నటుడిగా.. హీరోగా చేసింది' అని మనోజ్ ఈ ప్రోమోలో చెప్పారు. రాకింగ్ స్టార్ అనే పేరు ఇచ్చిందని చెప్పారు. అయితే, ఫ్యాన్స్, విజిల్స్ ఇలా పండగలా జరిగిన తన లైఫ్‍లోకి సడన్‍గా ఓ సైలెన్స్ వచ్చిందని మనోజ్ ఈ వీడియో చెప్పారు. “మనోజ్ అయిపోయాడు అన్నారు.. కెరీర్ ఖతం అన్నారు.. యాక్టింగ్ ఆపేశాడు, ఇక తిరిగి రాడు అన్నారు.. ఎనర్జీ స్టార్లో ఎనర్జీ తగ్గిందన్నారు.. విన్నాను.. చూశాను.. మౌనంగా భరించాను.. తిరిగొస్తున్నాను” అని ఈ టీజర్లో మంచు మనోజ్ డైలాగ్స్ ఉన్నాయి. మంచు మనోజ్ గేమ్ షో త్వరలో తమ ప్లాట్‍ఫామ్‍లో వస్తుందని ఈటీవీ విన్ పేర్కొంది. హీ ఈజ్ బ్యాక్, ర్యాంప్ ఆడిద్దాం అంటూ టీజ్ చేసింది. ఈ గేమ్‍షోను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూజ్ చేస్తోంది.
మంచు మనోజ్ చివరగా ఒక్కడు మిగిలాడు చిత్రంలో హీరోగా నటించారు. 2018లో ఆపరేషన్ 2019 సినిమాలో క్యామియో చేశారు. ఆ తర్వాతి నుంచి నటనకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాదే భూమా మౌనికను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఓటీటీలోకి గేమ్ షో ద్వారా అడుగుపెడుతున్నారు మంచు మనోజ్.