హిందీ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 15’ విజేతగా నిలిచారు మానసి ఘోష్. ఫైనల్‍లో అద్భుత పర్ఫార్మెన్స్ చేసి ట్రోఫీ కైవసం చేసుకున్నారు. గ్రాండ్ ఫినాలేలో సుభ్రజీత్ చక్రవర్తి, స్నేహ శంకర్‌ను ఓడించి విన్నర్ అయ్యారు మానసి. టైటిల్ ఫేవరెట్ అనుకున్న తెలుగు సింగర్ అనురుధ్ సుస్వరం టాప్-3 కూడా చేరలేకపోయారు.
ఇండియన్ ఐడల్ సీజన్ 15 విజేతగా నిలిచిన మానసి రూ.25లక్షల ప్రైజ్‍మనీ అందుకున్నారు. ఓ కొత్త కారు కూడా ఆమెకు దక్కింది. రన్నరప్‍గా సుభ్రజీత్ చక్రవర్తి నిలువగా.. మూడో స్థానం దక్కించుకున్నారు స్నేహ శంకర్. వారిద్దరికి చెరో రూ.5లక్షలు ప్రైజ్‍మనీగా దక్కింది.
తెలుగు సింగర్ అనిరుధ్ సుస్వరం.. ఇండియన్ ఐడల్ సీజన్ 15లో కొన్ని సూపర్ పర్ఫార్మెన్సులు చేశారు. తన గాత్రంతో అదరగొట్టారు. జడ్జిలు శ్రీయా ఘోషల్, విశాల్ దద్లానీ, బాద్‍షా చాలాసార్లు ఇంప్రెస్ అయ్యారు. ఈ సీజన్ టైటిల్‍ను అనిరుధ్ గెలుస్తాడని చాలా మంది అనుకున్నారు. అదే జోష్‍లో ఫైనల్‍లో అడుగుపెట్టారు అనిరుధ్. కానీ ఫైనల్‍లో అతడికి నిరాశ ఎదురైంది. ఆరో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మానసి, చక్రవర్తి, స్నేహ శంకర్ టాప్-3 చేరారు. బెంగాలీ సింగర్ మానసి టైటిల్ దక్కించుకున్నారు.
మానసి గతంలో సూపర్ సింగర్ సీజన్ 3లో పాల్గొని రెండో ప్లేస్‍లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచారు. ఇప్పుడు వచ్చిన ప్రైజ్‍మనీని తాను ఇండిపెండెంట్ మ్యూజిక్ కోసం వినియోగిస్తానని, కారును తానే వాడుకుంటానని మానసి తెలిపారు. ఈ షో వల్ల తన జీవితం మంచిగా మారిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇండియన్ ఐడల్ సీజన్ 15 గతేడాది అక్టోబర్‌లో మొదలైంది. సుమారు ఐదు నెలలకు పైగా సాగింది. స్టార్ సింగర్ శ్రీయా ఘోషల్, మ్యూజిక్ కంపోజల్ బాద్షా, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ జడ్జిలుగా వ్యవహరించారు. మీకా సింగ్, శిల్పా శెట్టి, రవీనా టాండన్ సహా కొందరు కొన్ని ఎపిసోడ్లకు గెస్టులుగా హాజరయ్యారు.
సంబంధిత కథనం