Man Dies while Watching Avatar 2: సినిమాలు మనుషులపై ప్రభావం చూపిస్తాయా? అంటే కొన్నిసార్లు అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది సినిమాలను చూస్తూ స్ఫూర్తి పొందడం ఒక ఎత్తయితే.. వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించడం మరో ఎత్తు. హర్రర్ సినిమాలు చూస్తూ మరణించిన దాఖాలాలు ఇప్పటికే చాలాసార్లు వార్తల్లో విన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతమైంది. కాకపోతే ఈ సారి అవతార్-2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందాడు. సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దపురంలో లక్ష్మీ రెడ్డి శ్రీను అనే వ్యక్తి శుక్రవారం విడుదలైన అవతార్-2 చూస్తూ చనిపోయాడు. పెద్దాపురంలో ఓ థియేటర్‌కు వెళ్లిన అతడికి గుండెపోటు రావడంతో సినిమా మధ్యలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమై అతడిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు నిర్ధారించారు.
అవతార్ మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా ఇలాంటి ఘటన తైవాన్‌లో ఒకటి జరిగింది. 2010లో అవతార్ సినిమా చూస్తూ తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అతడికి అతడికి హైబీపీ ఉండటం వల్ల సినిమా చూస్తూ తీవ్ర ఉద్వేకానికి లోనై బ్లడ్ ప్రెజర్ ఎక్కువై చనిపోయాడని వైద్యులు అప్పుడు తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు తీవ్రంగా ఉద్వేగానికి లోనుకావడం వల్ల ఇలాంటివి జరుగుతాయని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అవతార్ ది వే ఆఫ్ వాటర్(Avatar 2) ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూసిన ప్రేక్షకులకు శుక్రవారంతో ఆ కల తీరిపోయింది. డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. జేమ్స్ కేమెరూన్(James Cameron) దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ చూసేందుకు సినీ ప్రియులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. విడుదలైన ఒక్కరోజులోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
సంబంధిత కథనం