మలయాళం సినిమా మంచి థ్రిల్లర్లకు కేరాఫ్. అలాంటి ఇండస్ట్రీ నుంచి గతేడాది ఆగస్టులో వచ్చిన మూవీ చెక్‌మేట్ (Checkmate). ఈ మూవీకి థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాకపోవడంతో డిజిటల్ ప్రీమియర్ పై సందేహాలు నెలకొన్నాయి. అయితే మొత్తానికి ఇప్పుడు సుమారు 14 నెలల తర్వాత ఫ్రీగా స్ట్రీమింగ్ కు వచ్చింది.
మలయాళం థ్రిల్లర్ మూవీ చెక్‌మేట్ ఓటీటీ స్ట్రీమింగ్ జీ5 ఓటీటీలో అయింది. ఆ ఓటీటీ ఈ విషయాన్ని గురువారం (అక్టోబర్ 2) తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొత్తానికి ఎదురు చూపులు ఫలించాయని, చెక్‌మేట్ ఇప్పుడు ఫ్రీగా జీ5లో స్ట్రీమింగ్ అవుతోందని తెలిపింది. అది కూడా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అయింది.
ఈ వారం ఇప్పటికే మైనే ప్యార్ కియా, సాహసం, కొలాంబిలాంటి మరికొన్ని మలయాళం సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు రాగా.. ఇప్పుడీ చెక్‌మేట్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మలయాళం కంటెంట్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ వీకెండ్ మంచి టైంపాస్ కానుంది.
చెక్‌మేట్ మూవీ గతేడాది ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైంది. అయితే ప్రేక్షకుల నుంచి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలో 6.2 రేటింగ్ మాత్రమే నమోదైంది. ఇది న్యూయార్క్ నేపథ్యంలో సాగే ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఒక కిడ్నాప్ కేసును ఛేదించే ప్రయత్నంలో.. ఒక లాయర్, భార్యను కోల్పోయిన ఒక వ్యక్తి, కెరీర్లో ఎదుగుతున్న ఒక డిజైనర్, ఒక ఫార్మాస్యూటికల్ సీఈఓల జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడతాయి.
రతీష్ శేఖర్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను కూడా దర్శకుడే స్వయంగా అందించాడు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ సినిమాలో కథను చెప్పిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో లాల్, రేఖ, హరింద్రన్, అనూప్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సౌమ్య రాజన్, స్వప్నీల్ బత్రా, రాజాలక్ష్మి, విశ్వం నాయర్, అంజలి మోహనన్ వంటి వారు సపోర్టింగ్ పాత్రల్లో కనిపించారు. మరి ఈ సినిమా ఇప్పుడు ఫ్రీగా జీ5 ఓటీటీలోకి అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.
సంబంధిత కథనం