ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ నెక్ట్స్ లెవెల్.. ఇదో రియల్ రెస్క్యూ ఆపరేషన్.. యూట్యూబ్‌లో చూడండి-malayalam survival thriller take off fahadh faasil movie streaming free on youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ నెక్ట్స్ లెవెల్.. ఇదో రియల్ రెస్క్యూ ఆపరేషన్.. యూట్యూబ్‌లో చూడండి

ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ నెక్ట్స్ లెవెల్.. ఇదో రియల్ రెస్క్యూ ఆపరేషన్.. యూట్యూబ్‌లో చూడండి

Hari Prasad S HT Telugu

ఫహాద్ ఫాజిల్ నటించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఈ జానర్లో మరో లెవెల్ అని చెప్పొచ్చు. భారత ప్రభుత్వం చేసిన ఓ రియల్ రెస్క్యూ ఆపరేషన్ పై రూపొందిన మూవీ ఇది. ఆసిఫ్ అలీ, కొంచకో బొబన్ లాంటి మలయాళ స్టార్లు కూడా నటించారు.

ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ నెక్ట్స్ లెవెల్.. ఇదో రియల్ రెస్క్యూ ఆపరేషన్.. యూట్యూబ్‌లో చూడండి

మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ టేకాఫ్ (Take Off) చూశారా? 2017లో వచ్చిన సినిమా ఇది. ఓ రియల్ స్టోరీ. 2014లో ఇరాక్ లోని టిక్రిత్‌లో అక్కడి అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 19 మంది మలయాళీ నర్సులను విజయవంతంగా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చిన ఆపరేషన్ పై రూపొందిన మూవీ ఇది. ఫహాద్ ఫాజిల్, పార్వతి తిరువోతు, ఆసిఫ్ అలీ, కుంచకో బొబన్ లాంటి వాళ్లు నటించారు.

టేకాఫ్ మూవీ స్టోరీ ఇదే..

టేకాఫ్ సినిమాను మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో కుంచకో బొబన్, పార్వతి తిరువోతు వరుసగా షాహిద్, సమీరా అనే నర్సులుగా నటించగా.. ఫహాద్ ఫాజిల్ ఇరాక్ లోని బాగ్దాద్ లో ఇండియన్ ఎంబసీ అధికారి మనోజ్ అబ్రహం పాత్ర పోషించాడు. 2014లో ఇరాక్ లో జరిగిన అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన మలయాళీ నర్సులను కాపాడిన ఎపిసోడ్ పై ఈ సినిమాను తెరకెక్కించారు.

ఆ ఏడాది 19 మంది మలయాళీ నర్సులు ఇరాక్ లో వైద్య సేవలు అందించడానికి వెళ్తారు. అప్పటికే ఎన్నో అప్పులు, కష్టాల్లో ఉన్న వాళ్లు అక్కడికెళ్తే కాస్త ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో వెళ్తారు. వాళ్లలో షాహిద్, సమీరా కూడా ఉంటారు. సమీరాకు అప్పటికే పెళ్లయి భర్తతో విడిపోతుంది. ఆమెకు ఓ కొడుకు ఉంటాడు. అయినా షాహిద్ ఆమెను పెళ్లి చేసుకొని ఇద్దరూ కలిసి ఇరాక్ వెళ్తారు. అప్పటికే ఆమె షాహిద్ ద్వారా మరో గర్భవతి అవుతుంది.

ఇరాక్ వెళ్లిన తర్వాత అక్కడి యుద్ధ వాతావరణం ఏంటో వాళ్లకు తెలిసొస్తుంది. ఇదే సమయంలో సమీరా మొదటి భర్త ఆమెకు తమ కొడుకును అప్పగించి వెళ్లిపోతాడు. అటు షాహిద్ మోసుల్ కు వెళ్తాడు. అక్కడ ఇరాక్ సేనలను ఓడించి ఐసిస్ ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకుతోపాటు కడుపులో బిడ్డతో తన భర్త కోసం యుద్ధ భూమిలో సమీరా చేసే పోరాటం ఏంటి? ఆమెతోపాటు అక్కడ చిక్కుకుపోయిన మిగిలిన మలయాళీ నర్సులను సురక్షితంగా ఇండియాకు తరలించడానికి ఇండియన్ ఎంబసీ అధికారి మనోజ్ అబ్రహం ఎలాంటి ప్రయత్నాలు చేశారన్నది ఈ టేకాఫ్ మూవీలో చూడొచ్చు.

టేకాఫ్ ఎలా ఉందంటే?

టేకాఫ్ ఓ అసలు సిసలు సర్వైవల్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ మొత్తం షాహిద్, సమీరా ప్రేమ, వాళ్లు ఇరాక్ వెళ్లేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ సినిమా తిరుగుతుంది. సెకండాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ కూడా సెకండాఫ్ లోనే ఉంటుంది. ఇరాక్ లాంటి దేశంలో జరిగే అంతర్యుద్ధం నుంచి భారతీయులను విడిపించేందుకు చేసిన ఓ నిజమైన రెస్క్యూ ఆపరేషన్ ఎలా ఉంటుందో ఈ టేకాఫ్ మూవీ కళ్లకు కట్టినట్లు చూపించింది.

ముఖ్యంగా వాళ్లు సురక్షితంగా ఉండటంలో అప్పటి బాగ్దాద్ ఇండియన్ ఎంబసీ అధికారి మనోజ్ అబ్రహం పాత్రను కూడా ఈ సినిమాలో బాగా చూపించారు. ఈ పాత్రలో ఫహాద్ ఫాజిల్ ఒదిగిపోయాడు. ఇక సమీరాగా పార్వతి తిరువోతు అయితే జీవించేసింది. ఈ సినిమాకు ఆమె నటనే ప్రధాన బలం అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లు వసూలు చేసిన ఈ మూవీకి ఐఎండీబీలోనూ 8.1 రేటింగ్ నమోదైంది. ఈ సినిమా జియోహాట్‌స్టార్ తోపాటు యూట్యూబ్ లోనూ హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం