Malayalam Hits OTT: 2024 ఫస్టాఫ్‍లో మలయాళ ఇండస్ట్రీ జోరు.. బ్లాక్‍బస్టర్ సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..
Malayalam Movies OTT: మలయాళం ఇండస్ట్రీకి 2024లో తొలి ఆరు నెలలు కొన్ని బ్లాక్‍బస్టర్లు వచ్చాయి. కొన్ని మలయాళ చిత్రాలు భారీ కలెక్షన్లు కొల్లగొట్టాయి. అలా సూపర్ హిట్ అయిన ఆ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఉన్నాయంటే..
మలయాళ సినీ ఇండస్ట్రీకి 2024 ఇప్పటి వరకు చాలా అద్భుతంగా కలిసి వచ్చింది. ఈ ఏడాది ఫస్టాఫ్ (జనవరి నుంచి జూన్ వరకు) వచ్చిన కొన్ని సినిమాలు రికార్డుస్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. చాలా సినిమాలు వచ్చినా.. కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్లుగా నిలిచాయి. సక్సెస్ రేట్ ఎక్కువగా నమోదైంది. మంజుమ్మల్ బాయ్స్ రూ.200 కోట్ల కలెక్షన్లను దాటిన తొలి మలయాళ మూవీగా ఘనత సాధించింది. ప్రేమలు, ఆవేశం సహా మరిన్ని చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అలా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో బ్లాక్‍బస్టర్ అయిన మలయాళ చిత్రాలు ఏవో.. అవి ఏ ప్లాట్‍ఫామ్‍లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
మంజుమ్మల్ బాయ్స్
మలయాళ సినీ పరిశ్రమలో మంజుమ్మల్ బాయ్స్ ఆల్‍టైమ్ బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. సర్వైవల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సుమారు రూ.245 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. రూ.200 కోట్ల మార్క్ దాటిన తొలి మలయాళ మూవీగా చరిత్ర సృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మల్ బాయ్స్ ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత తెలుగులోనూ దుమ్మురేపింది. ఈ చిత్రంలో సౌహిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మే 5వ తేదీ నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేమలు
మలయాళ చిత్రం ప్రేమలు కూడా ఈ ఏడాది సూపర్ హిట్ లిస్టులో నిలిచింది. రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ లవ్ కామెడీ మూవీ ఏకంగా సుమారు రూ.136 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మలయాళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను సాధించింది. గిరీశ్ ఏడీ దర్శకత్వంలో నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ ప్రధాన పాత్రలు చేసిన ప్రేమలు సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
ఆవేశం
స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ నటించిన కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం రీసెంట్‍గా భారీ హిట్ అయింది. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ అయింది. ఈ సినిమా సుమారు రూ.150కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఆవేశం సినిమా మలయాళంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉంది. హిందీ వెర్షన్ హాట్‍స్టార్ ఓటీటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
గురువాయూర్ అంబలనాదయిల్
పృథ్విరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిల విమల్ ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ డ్రామా మూవీ ‘గురువాయూర్ అంబలనాదయిల్’ మే 16వ తేదీన విడుదలైంది. విపిన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి సుమారు రూ.90 కోట్ల వరకు కలెక్షన్లు దక్కాయి. ఈ చిత్రం ఇటీవలే జూన్ 27వ తేదీన మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
భ్రమయుగం
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి విడుదలై సూపర్ హిట్ కొట్టింది. రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం దాదాపు రూ.85కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. భ్రమయుగం చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరో మూడు..
ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాస్, కల్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ వర్షంగల్కు శేషం కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు ఉంది. మమ్ముట్టి హీరోగా నటించిన టర్బో సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ చిత్రం జూలైలో సోనీ లివ్ ఓటీటీలోనూ అడుగుపెట్టనుంది. జయరాం, మమ్ముట్టి ప్రధాన పాత్రలు పోషించిన అబ్రహాం ఓజ్లెర్ చిత్రం మంచి హిట్ అయింది. ఈ మూవీ హాట్‍స్టార్ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
ఇంకా రాని ఆడుజీవితం
పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఆడుజీవితం సినిమా మార్చి 28వ తేదీని విడుదలైంది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సర్వైవల్ డ్రామా చిత్రం సుమారు రూ.160కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్‍స్టార్ దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఆడుజీవితం మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రాలేదు.
టాపిక్