మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ట్విస్టులే ట్విస్టులు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా. గతేడాది జులైలో థియేటర్లలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు యూట్యూబ్ లోనూ తెలుగులో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఎలాంటి స్టార్స్ లేకుండా ఓ చిన్న సినిమాగా తెరకెక్కినా.. మంచి థ్రిల్ పంచిన మూవీ ఇది. సినిమా పేరు కురుక్కు.
మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కురుక్కు తెలుగులో వీ2 డబుల్ మర్డర్ అనే పేరుతో వచ్చింది. థియేటర్లలో కాకుండా నేరుగా యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ కు రావడం విశేషం. కేవలం గంటా 49 నిమిషాల నిడివితోనే ఉన్న సినిమా ఇది. భార్యాభర్తల హత్యల చుట్టూ తిరిగే కథ. సినిమా మొదట్లోనే వీళ్ల హత్యలు జరిగినట్లుగా చూపిస్తారు.
వాళ్ల అపార్ట్‌మెంట్ బిల్డింగ్ లోనే ఉండే ఓ ఐటీ ఉద్యోగి ఆ హత్యలు చేశాడన్నట్లుగా అతడు కత్తి పట్టుకొని వాళ్ల దగ్గరికి వెళ్లడం చూపిస్తారు. ఆ తర్వాత పోలీసులు ఎంటరవుతారు. ఈ కేసును సీఐ సజన్ (అనిల్ ఆంటో) దర్యాప్తు చేస్తుంటాడు. ఈ కేసును తవ్వినకొద్దీ ఎంతో మంది అనుమానితులు, ఊహకందని ట్విస్టులు అతనికి ఎదురవుతుంటాయి.
దర్యాప్తు సమయంలోనే ఇద్దరు అనుమానితులు కూడా హత్యకు గురవడం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పోలీస్ అధికారి ఆ హత్యల కేసును ఎలా పరిష్కరిస్తాడు? క్లైమ్యాక్స్ లో ఎదురయ్యే ట్విస్ట్ ఏంటి? ఆ భార్యభర్తలను హత్య చేసింది ఒక్కరేనా? లేక వేర్వేరా అన్నది ఈ వీ2 డబుల్ మర్డర్ మూవీలో చూడొచ్చు.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ఊహకందని ట్విస్టులే ప్రధానం. అవే లేకపోతే, ఆ హత్యలు చేసిందెవరో ప్రేక్షకులకు ముందుగానే ఓ ఐడియా వచ్చేస్తే ఇక థ్రిల్ అనేదే ఉండదు. ఇలాంటి సినిమాలు సాధారణంగా క్లైమ్యాక్స్ వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది గెస్ చేయలేని విధంగా ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయి, కళ్లప్పగించి చూసేలా ఉండాలి.
ఈ కురుక్కు (వీ2 డబుల్ మర్డర్) మూవీ సరిగ్గా అలా తీసిందే. ఇందులో వచ్చే ట్విస్టులు ఊహకందని విధంగానే సాగుతాయి. జంట హత్యల కేసులో ఎంతో మంది అనుమానితులు తెరపైకి వస్తుంటారు. ఎన్నో చిక్కు ముడులు పోలీసులకు ఎదురవుతాయి. వాటిని ఛేదించే తీరు మంచి థ్రిల్ ను అందిస్తుంది. కేవలం గంటా 49 నిమిషాల నిడివి ఉన్న మూవీనే కావడంతో ఎక్కడా బోర్ కూడా కొట్టదు. తెలుగు డబ్బింగ్ కూడా ఫర్వాలేదు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఈ థ్రిల్లర్ కు తగినట్లుగా మరింత క్వాలిటీగా ఉంటే బాగుండేది. పెద్దగా పేరు తెలియని నటీనటులే అయినా కథ, కథనాలే ఈ మూవీని చివరి వరకూ చూసేలా చేస్తాయి. ఈ మూవీని ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. వెంటనే చూసేయండి.
సంబంధిత కథనం