Malayalam Box office: మూడు నెలలు.. రూ.670 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర మలయాళం సినిమా సూపర్ హిట్
Malayalam Box office: ఈ ఏడాది మలయాళం సినిమాలు ఊపేస్తున్నాయి. 2024లో తొలి మూడు నెలలు కలిపి ప్రపంచవ్యాప్తంగా మాలీవుడ్ సినిమాలు ఏకంగా రూ.670 కోట్లు వసూలు చేయడం విశేషం.
Malayalam Box office: సాధారణంగా మలయాళం సినిమాలంటే లోబడ్జెట్ తోనే తెరకెక్కుతాయి. దానికి తగినట్లే బాక్సాఫీస్ వసూళ్లు కూడా ఉంటాయి. కానీ కొన్నేళ్లుగా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇక 2024లో అయితే తొలి మూడు నెలల్లోనే ఏకంగా రూ.670 కోట్లతో మలయాళం సినిమాలు సంచలనం సృష్టించాయి. గతేడాది అక్కడి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు ఎదురైనా.. ఈసారి మాత్రం లాభాల పంట పండుతోంది.
మలయాళం బాక్సాఫీస్ రిపోర్ట్
ఈ ఏడాది జనవరి నెల నుంచే మలయాళం సినిమాల హవా మొదలైంది. ఆట్టమ్ సినిమాతో మొదలైన వసూళ్ల పర్వం.. తొలి మూడు నెలలూ కొనసాగింది. ఈ సినిమా బాక్సాఫీస్ తోపాటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక జనవరిలోనే రోమాంచం, అబ్రహం ఓజ్లర్ లాంటి హిట్స్ దక్కాయి. అబ్రహం ఓజ్లర్ కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఆ సినిమా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసింది.
ఇక అదే నెలలో భారీ అంచనాల మధ్య రిలీజైన మోహన్ లాల్ మలైకొట్టై వాలిబన్ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మొత్తంగా జనవరిలో మలయాళం ఇండస్ట్రీ నుంచి 17 సినిమాలు రిలీజ్ అయినా.. మూడు మాత్రమే సక్సెస్ అయ్యాయి.
ఫిబ్రవరిలో దూకుడు
అయితే ఫిబ్రవరి నెల మాత్రం మలయాళం ఇండస్ట్రీ సత్తా ఏంటో చాటింది. ఆ నెలలో భ్రమయుగం, ప్రేమలు, అన్వేషిప్పిన్ కండెతుమ్, ఆల్ టైమ్ హిట్ మంజుమ్మల్ బాయ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకరకంగా ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెసైందని చెప్పాలి. సాధారణ బడ్జెట్ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్ బాక్సాఫీస్ దగ్గర రూ.40 కోట్లు వసూలు చేసింది.
ఇక ప్రేమలు మూవీ చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకుపైనే వసూలు చేసింది. తెలుగులోనూ రిలీజై.. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. మమ్ముట్టి భ్రమయుగం మూవీ కూడా రూ.85 కోట్ల వరకూ వసూలు చేసి ఆశ్చర్యం కలిగించింది. అన్నింటికీ మించి మంజుమ్మల్ బాయ్స్ రిలీజ్ మలయాళం ఇండస్ట్రీ రాతనే మార్చేసింది.
ఆ ఇండస్ట్రీ నుంచి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకుపైగా వసూలు చేసింది. అసలు మలయాళం నుంచి వచ్చి రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి సినిమా ఇదే. ఇప్పుడు తెలుగులోనూ అదే రేంజ్ లో కలెక్షన్లు రాబడుతోంది. మార్చి నెల చివర్లో వచ్చిన ఆడుజీవితం కూడా రూ.100 కోట్ల మార్క్ దాటేసింది.
ఆరు సినిమాలు సూపర్ హిట్
మలయాళం ఇండస్ట్రీ నుంచి తొలి మూడు నెలల్లో 61 సినిమాలు రాగా.. అందులో ఆరు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ ఆరు సినిమాల నుంచే ఏకంగా రూ.674.2 కోట్లు వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ రూ40.7 కోట్లు, అన్వేషిప్పిన్ కండెతుమ్ రూ.40 కోట్లు, ప్రేమలు రూ.131.3 కోట్లు, భ్రమయుగం రూ.85 కోట్లు, మంజుమ్మల్ బాయ్స్ రూ.234.55 కోట్లు, ఆడుజీవితం రూ.142.65 కోట్లు వసూలు చేశాయి.
2024లో రెండో క్వార్టర్ ను కూడా మలయాళం సినిమా బాగానే స్టార్ట్ చేసింది. ఫహద్ ఫాజిల్ ఆవేశంతోపాటు వర్షంగల్కు శేషం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతమయ్యాయి.
టాపిక్