Malayalam Movies 2024: మలయాళం సినిమా బ్లాక్‌బస్టర్.. ఈ ఏడాది దుమ్ము రేపిన మాలీవుడ్.. వీటిని ఏ ఓటీటీలో చూడాలంటే?
Malayalam Movies 2024: మలయాళం సినిమా ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ అయింది. ఈ సినిమా ఇండస్ట్రీ గ్రాస్ వసూళ్లు ఈ ఏడాది రూ.1000 కోట్లకుపైనే ఉండటం విశేషం. 207 సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఐదు సినిమాలు రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి.
Malayalam Movies 2024: మలయాళం సినిమాలు 2024లో దుమ్ము రేపాయి. ఆ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ఐదు సినిమాలు రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ వసూలు చేశాయి. ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ నుంచి 207 సినిమాలు రిలీజయ్యాయి. బుధవారం (డిసెంబర్ 25) క్రిస్మస్ సందర్భంగా మోహన్ లాల్ డైరెక్ట్ చేసిన బరోజ్ మూవీ కూడా రిలీజైంది. వీటిలో 22 సినిమాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.
మలయాళం మూవీస్ బ్లాక్‌బస్టర్
2024లో మొదటి నుంచీ మలయాళం ఇండస్ట్రీ నుంచి సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. వాటిలో మంజుమ్మెల్ బాయ్స్ అన్నింటి కంటే ముందుంది. ఈ మూవీ ఏకంగా రూ.241 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇదే కాకుండా ప్రేమలు, ఆడుజీవితం, ఆవేశం, ఏఆర్ఎం మూవీస్ కూడా రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి.
మలయాళంలో రూ.100 కోట్ల మార్క్ అనేది చాలా అరుదు. అలాంటిది ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు ఆ మార్క్ దాటడం అంటే మాటలు కాదు. మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత ఆడుజీవితం రూ.158.48 కోట్లు, ఆవేశం రూ.156 కోట్లు, ప్రేమలు రూ.135 కోట్లు, అజయంతే రండమ్ మోషనమ్ రూ.106 కోట్లు వసూలు చేశాయి.
ఇవి కాకుండా గురువాయూర్ అంబలనడియిల్ రూ.90 కోట్లు, వర్షంగల్కు శేషం రూ.83 కోట్లతో ఆ మార్క్ కు దగ్గరగా వచ్చాయి. కిష్కింధ కాండం రూ.77 కోట్లు, టర్బో రూ.72 కోట్లు, భ్రమయుగం రూ.58 కోట్లు వసూలు చేశాయి. ఇక కేరళలో వసూళ్ల విషయానికి వస్తే రూ.79 కోట్లతో ఆడుజీవితం టాప్ లో ఉండగా.. రూ.76 కోట్లతో ఆవేశం, రూ.72 కోట్లుతో మంజుమ్మెల్ బాయ్స్ ఉన్నాయి.
22 సినిమాలకు లాభాలు.. కానీ..
మలయాళం సినిమాకు 2024 ఓ స్వర్ణయుగంలా నిలిచిందన్నది నిజమే. కానీ అదే సమయంలో పెద్ద సంఖ్యలో సినిమాలు నిరాశ పరిచాయి. మొత్తంగా 207 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాగా.. వాటిలో కేవలం 22 సినిమాలు మాత్రమే లాభాలు తెచ్చి పెట్టాయి. మిగిలిన సినిమాల్లో ప్రొడ్యూసర్లకు నష్టాలే మిగిలాయి. 2023లో 222 సినిమాలు రిలీజ్ కాగా.. 2024లో వీటి సంఖ్య కాస్త తగ్గింది.
ఈ ఏడాది సూపర్ హిట్ అయిన వాటిలో పైన చెప్పినవే కాకుండా టర్బో, వాజా కూడా ఉన్నాయి. ఇక హిట్ మూవీస్ జాబితాలో అబ్రహం ఓజ్లర్, అన్వేషిపిన్ కండెతుమ్, బౌగెన్‌విల్లా, హెలో మమ్మీ, పాణి, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు ఉన్నాయి. తలవన్, గోలమ్, నునాకుజి, ఉల్లోజుక్కులాంటి సినిమాలు ఓ మోస్తరు హిట్ అయ్యాయి.
ఈ ఓటీటీల్లో చూడండి
2024లో మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలను ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
మంజుమ్మెల్ బాయ్స్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్రేమలు - హాట్‌స్టార్, ఆహా వీడియో
ఆడుజీవితం - నెట్‌ఫ్లిక్స్
ఆవేశం - ప్రైమ్ వీడియో
ఏఆర్ఎం - హాట్‌స్టార్
భ్రమయుగం - సోనీలివ్
కిష్కింధ కాండం - హాట్‌స్టార్
బౌగెన్‌విల్లా - సోనీలివ్
టాపిక్