Most Profitable Movie: బడ్జెట్ రూ.3 కోట్లు.. వసూళ్లు రూ.136 కోట్లు.. పుష్ప 2 రికార్డు బ్రేక్.. 2024లో అత్యధిక లాభాల మూవీ
Most Profitable Movie: పుష్ప 2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో ఉండొచ్చు. కానీ 2024లో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా మాత్రం అది కాదు. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.136 కోట్లు వసూలు చేసింది.
Most Profitable Movie: మలయాళం మూవీ మేకర్స్ తక్కువ బడ్జెట్ తో మంచి లాభాలు ఆర్జించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే 2024 మాత్రం వారికి మరింత స్పెషల్. ఆ ఇండస్ట్రీ నుంచి కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. ఏకంగా 45 రెట్ల లాభాలు ఆర్జించి పెట్టడం విశేషం. గతేడాది పుష్ప 2, కల్కి 2898 ఏడీ లాంటి సినిమాలు రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించినా.. లాభాల విషయంలో ఈ లో బడ్జెట్ మూవీ ముంది దిగదుడుపే.
ఈ రొమాంటిక్ డ్రామాను కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏకంగా రూ.136 కోట్లు వసూలు చేసింది. అంటే బడ్జెట్ కంటే 45 రెట్లు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీస్ లో ఇదీ ఒకటి. 2024లో ఏ ఇండియన్ సినిమా కూడా ఇన్ని రెట్ల లాభాలు ఆర్జించలేకపోయింది.
ఓవరాల్‌గా మూడో స్థానంలో..
లాభాల విషయంలో గతేడాది టాప్ లో నిలిచిన ప్రేమలు.. ఓవరాల్ గా ఇండియన్ సినిమా చరిత్రలో మాత్రం మూడో స్థానంలో ఉంది. సీక్రెట్ సూపర్ స్టార్, జై సంతోషి మా మూవీస్ మాత్రమే ప్రేమలు కంటే ఎక్కువ రెట్ల లాభాలను సొంతం చేసుకున్నాయి. పుష్ప 2, కల్కి 2898 ఏడీలాంటి సినిమాలు వసూలు చేసిన మొత్తంతో పోలిస్తే ప్రేమలు బాక్సాఫీస్ వసూళ్లు పది శాతం కూడా లేకపోయినా.. ఆ సినిమాల బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండటంతో లాభాలు తక్కువగా ఉంటాయి.
2024లో వచ్చిన పుష్ప 2 మూవీ ఇప్పటి వరకూ రూ.1800 కోట్లకుపైగా వసూలు చేసి.. అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. అయితే ఆ మూవీని రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడంతో ఈ వసూళ్లు కేవలం ఐదు రెట్లు మాత్రమే అవుతాయి.
ప్రేమలు సినిమా ఏంటి?
మలయాళం మూవీ ప్రేమలు గతేడాది రిలీజై సంచలన విజయం సాధించింది. కేరళలోనే కాదు తర్వాత తెలుగులోనూ వచ్చి ఇక్కడా రికార్డుల వర్షం కురిపించింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. గిరిష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నస్లేన్ కే.గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, అఖిల భార్గవన్, శ్యామ్ మోహన్ లాంటి వాళ్లు నటించారు.
హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేయడానికి వచ్చే ఓ యువకుడు, అతనికి అప్పటికే ఉద్యోగం చేస్తూ పరిచయం అయ్యే అమ్మాయి చుట్టూ తిరిగే కథే ఈ ప్రేమలు. ఈ రొమాంటిక్ కామెడీకి తెలుగులోనూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.