నిపా వైరస్ గుర్తుందా? కొన్నేళ్ల కిందట అంటే 2018లో కేరళను వణికించి దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో కేరళలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖతోపాటు అక్కడి ఓ మెడికల్ టీమ్ దానిని సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు అసలు అది ఎక్కడ మొదలైందన్నది కూడా గుర్తించారు. ఈ రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించిన మూవీయే వైరస్. ఇప్పుడీ సినిమా యూట్యూబ్‌లోనూ తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళం మూవీ వైరస్ ను కేరళలోని కోళికోడ్ జిల్లాలో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. అక్కడ జకారియా మహ్మద్ అనే ఓ పేషెంట్ ఓ ఇన్ఫెక్షన్ తో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చేరతాడు. కొన్నాళ్లపాటు ఆ వైరస్ తో పోరాడి కన్నుమూస్తాడు. అతనికి సీటీ స్కాన్ తీసిన గీత అనే అమ్మాయి కూడా వైరస్ బారిన పడుతుంది.
ఆ తర్వాత జకారియాకు చికిత్స అందించిన నర్స్ అఖిలను కూడా ఆ వైరస్ వదలదు. ఇలా మెల్లగా కోళికోడ్ మొత్తం నెమ్మదిగా వైరస్ కేసులు పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో జకారియా తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ సలీం.. నిపా వైరస్ గా అనుమానించి టెస్టులు చేయాల్సిందిగా మరో డాక్టర్ కు సూచిస్తాడు. ఓవైపు వరుసగా వైరస్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అది నిపా వైరసే అని తేలుతుంది. కోళికోడ్ తోపాటు ఇతర జిల్లాలకు కూడా అది వ్యాపిస్తుంది.
దీంతో అప్రమత్తమైన కేరళ ఆరోగ్య శాఖ.. ఆరోగ్య మంత్రి సీకే ప్రమీల (రేవతి), స్థానిక జిల్లా కలెక్టర్ పాల్ అబ్రహం (టొవినో థామస్) నేతృత్వంలో ఓ మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేసి అసలు దీని సంగతేంటో తేల్చడానికి సిద్ధమవుతారు. ఒక్కో కేసును మెల్లగా తవ్వుతూ కాలంలో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు.
అసలు ఆ వైరస్ ఎక్కడ మొదలైంది? జకారియాకు ఎలా సోకింది అని తెలుసుకోవడమే లక్ష్యం పని చేస్తారు. ఇలా స్థానిక సైంటిస్టులు, మెడికల్ ప్రొఫెషనల్స్, ఆసుపత్రి సిబ్బంది, వలంటీర్లు కలిసికట్టుగా ఈ నిపా వైరస్ కు ఎలా చెక్ పెట్టారన్నదే ఈ వైరస్ మూవీ స్టోరీ.
వైరస్ మూవీని ఆశిఖ్ అబు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో రేవతితోపాటు టొవినో థామస్, ఆసిఫ్ అలీ, పార్వతి తిరువోతు, కుంచకో బొబన్, ఇంద్రజీత్ సుకుమారన్ లాంటి వాళ్లు నటించారు. వైరస్ ఓ అసలు సిసలు మెడికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. కరోనా అనే మహమ్మారి మనకు పరిచయం కాకముందే కేరళను వణికించిన నిపా వైరస్, దాని మూలాలు, ఆ ప్రాణాంతక వైరస్ పై కేరళ చేసిన పోరాటాన్ని ఈ వైరస్ మూవీ ద్వారా మన కళ్లకు కట్టేలా చూపించారు.
ముఖ్యంగా మూవీలో అసలు వైరస్ మూలాన్ని కనుక్కోవడం కోసం అక్కడి అధికారులు సాగించిన వేట హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. ఇక ఈ నిపా వైరస్ కు అసలు కారణం ఏంటి? జకారియాకు అసలు అది ఎలా సోకిందో చూపెడుతూ మూవీని ముగించడం కూడా బాగుంటుంది. ఈ సినిమా జీ5 ఓటీటీతోపాటు యూబ్యూట్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకూ చూడకపోతే వెంటనే చూసేయండి.
సంబంధిత కథనం