మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, మిస్టరీ థ్రిల్లర్స్ కు అసలు కొదవే లేదు. వాళ్లు ఎక్కువగా ఇలాంటి సబ్జెక్టులతోనే మూవీస్ తీస్తుంటారు. మూడేళ్ల కిందట కూడా ఓ అదిరిపోయే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీ పేరు జాన్ లూథర్ (John Luther). యూట్యూబ్ లో హిందీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ఇది.
మలయాళ నటుడు జయసూర్య లీడ్ రోల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ జాన్ లూథర్. ఈ టైటిల్ రోల్లోనే అతడు కనిపించాడు. మే, 2022లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. అభిజిత్ జోసెఫ్ కథ అందించడంతోపాటు మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో చాలా పాత్రలే ఉన్నా.. ప్రధానంగా లీడ్ రోల్ చుట్టే తిరుగుతుంది. ఇది ఓ సీరియల్ కిల్లర్ కు సంబంధించిన థ్రిల్లర్ మూవీయే అయినా.. ఆ కథ చెప్పిన విధానం కాస్త కొత్తగా అనిపిస్తుంది.
ఈ మూవీ ఓ బైక్ యాక్సిడెంట్ తో మొదలవుతుంది. ఆ బైకుపై ఇద్దరు ప్రయాణిస్తుండగా.. ఒకరి బాడీ దొరకుతుంది. కానీ మరొకరు మిస్ అవుతారు. ఈ కేసును సీఐ జాన్ లూథర్ (జయసూర్య) టేకప్ చేస్తాడు. ఆ మిస్సయిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్న క్రమంలోనే.. మరో చోట ఓ స్కూలుకు వెళ్లే చిన్నారి కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత ఓ మహిళ కూడా అలాగే అలాగే మిస్ అవుతుంది.
ఈ మిస్సింగ్ కేసులను విచారిస్తున్న పోలీస్ అధికారికి ఓ నంబర్ లేని వాహనమే క్లూగా మారుతుంది. దాని చుట్టూ తన దర్యాప్తు జరుపుతాడు. ఈ క్రమంలో మరో కేసుకు సంబంధించిన విచారణ సమయంలో ప్రమాదం జాన్ లూథర్ తన వినికిడి కోల్పోతాడు.
ఆ తర్వాత కూడా ఈ మిస్సింగ్ కేసులను అతడు ఎలా విచారిస్తాడన్నది ఈ మూవీలో మరో ఆకర్షణగా చెప్పొచ్చు. దర్యాప్తులో భాగంగా ఓ చోట వెంట్రుకలు, రక్తపు మరకలు కీలకమలుపుగా మారతాయి. ఇక క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్టు కూడా ఊహకందని విధంగా ఉంటుంది.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ సహజంగానే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చివరి వరకు ఆసక్తికరంగా సాగుతాయి. ఈ సినిమా ద్వారానే తొలిసారి దర్శకుడిగా పరిచయమైన అభిజిత్ జోసెఫ్.. జాన్ లూథర్ ను రక్తి కట్టించాడు. ఓ రోడ్డు ప్రమాదం దగ్గర మొదలయ్యే విచారణ.. చివరికి ఓ సీరియల్ కిల్లర్ వరకు చేరే విధానం థ్రిల్ అందిస్తుంది. ఇక జాన్ లూథర్ అనే సీఐ పాత్రలో జయసూర్య నటన అద్భుతమనే చెప్పాలి.
అతడు ఇందులో జీవించేశాడు. ముఖ్యంగా వినికిడి శక్తి కోల్పోయిన తర్వాత కూడా హియరింగ్ ఎయిడ్ సాయంతో అతడు దర్యాప్తు చేసే తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ జాన్ లూథర్ మూవీ మనోరమ మ్యాక్స్ లో కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. అయితే దీనిని యూట్యూబ్ లో హిందీలో డబ్ చేశారు. ఒకవేళ హిందీ ఆడియో అయినా సరే అనుకుంటే.. ఫ్రీగా చూడొచ్చు.
సంబంధిత కథనం