Malayalam Film Industry: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ ఇండస్ట్రీ కొన్నాళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నట్లు ది కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (కేఎఫ్‌పీఏ) వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో అయితే 17 సినిమాలు థియేటర్లలోకి రాగా కేవలం ఒకే ఒక్క మూవీ మాత్రమే హిట్ కావడం గమనార్హం.
మలయాళం సినిమా ఇండస్ట్రీలో గతేడాది పెద్ద హిట్స్ ఎన్నో ఉన్నాయి. అయినా ఇండస్ట్రీ మాత్రం నష్టాలనే ఎదుర్కొంది. ఈ ఏడాది ఈ నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. జనవరిలో రూ.110 కోట్ల నష్టం రాగా.. ఫిబ్రవరిలో మరో రూ.52 కోట్ల నష్టం వాటిల్లింది. గత నెలలో 17 సినిమాలు రిలీజ్ కాగా.. కేవలం ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుంది. లవ్‌డేల్ అనే ఓ డిజాస్టర్ సినిమా అయితే రూ.1.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. చివరికి కేవలం రూ.10 వేల థియేటర్ షేర్ మాత్రమే సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇక నుంచి ప్రతి నెలా తమ ఇండస్ట్రీ సినిమాల రిపోర్టు ఇవ్వాలని కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఫిబ్రవరిలో రిలీజైన 17 సినిమాల బడ్జెట్, అవి సాధించిన థియేటర్ షేర్ల వివరాలను కూడా రివీల్ చేసింది. కేఎఫ్‌పీఏ వైస్ ప్రెసిడెంట్ జీ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో తెరకెక్కిన సినిమాల బడ్జెట్ రూ.75.23 కోట్లు కాగా.. థియేటర్ షేర్ రూపంలో వచ్చింది కేవలం రూ.23.55 కోట్లే అని వెల్లడించారు.
కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఫిబ్రవరి నెలలో రిలీజైన సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్ల వివరాలను వెల్లడించింది.
సినిమా | బడ్జెట్ | థియేటర్ షేర్ |
ఐజా | ₹63 లక్షలు | ₹45,000 |
లవ్‌డేల్ | ₹1.60 కోట్లు | ₹10,000 |
నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ | ₹5.48 కోట్లు | ₹33 లక్షలు |
బ్రొమాన్స్ | ₹8 కోట్లు | ₹4 కోట్లు |
దవీద్ | ₹9కోట్లు | ₹3.50 కోట్లు |
పెయిన్‌కిలి | ₹5 కోట్లు | ₹2.50 కోట్లు |
ఆఫీసర్ ఆన్ డ్యూటీ | ₹13 కోట్లు | ₹11 కోట్లు |
చట్టులి | ₹3.40 కోట్లు | ₹32 లక్షలు |
గెట్ సెట్ బేబీ | ₹9 కోట్లు | ₹1.40 కోట్లు |
తడవు | NA | NA |
ఉరుల్ | ₹25 lakh | ₹1 లక్ష |
మాచంతే మాలఖ | ₹5.12 కోట్లు | ₹40 లక్షలు |
ఆత్మ సాహో | ₹1.50 కోట్లు | ₹30 లక్షలు |
అరికె | ₹1.50 కోట్లు | ₹55,000 |
ఇది మజ కాట్టు | ₹5.74 కోట్లు | ₹2.10 లక్షలు |
ఆప్ కైసే హో | ₹2.50 కోట్లు | ₹5 లక్షలు |
రందాం యామమ్ | ₹2.50 కోట్లు | ₹80,000 |
ఇప్పటి వరకూ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని సినిమాల కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించారని కూడా సురేష్ తెలిపారు. అందువల్ల ఇక నుంచి అలా రూ.50 కోట్లు, రూ.100 కోట్ల ప్రకటనలను నిలిపేస్తున్నట్లు చెప్పారు. కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించడం వల్ల స్టార్లు తమ రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి నెలా తమ సినిమాల బడ్జెట్, కలెక్షన్ల వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. గతేడాది కూడా మలయాళం ఇండస్ట్రీ రూ.700 కోట్లు నష్టాల్లో ఉన్నట్లు చెప్పింది. ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే రూ.162 కోట్ల నష్టాలు వచ్చాయి.
సంబంధిత కథనం