మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ జావా (Operation Java). తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. నిజ జీవితంలో జరిగిన సైబర్ నేరాలను తీసుకొని వాటిని ఎలా పరిష్కరించారో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్స్టార్, యూట్యూబ్ లలో హిందీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళం మూవీ ఆపరేషన్ జావా దేశం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సవాళ్ల గురించి చర్చించింది. అందులో ఒకటి సైబర్ నేరాలు కాగా.. మరొకటి దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న వారి కష్టాలను కూడా కళ్లకు కట్టింది.
కొచ్చిలోని ఓ సైబర్ క్రైమ్ సెల్ ఏడాదిన్నర వ్యవధిలో పరిష్కరించిన వివిధ నిజ జీవిత సైబర్ నేరాల చుట్టూ తిరిగే మూవీ ఇది. ఈ నేరాలను ఇద్దరు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ సాయంతో ఎలా పరిష్కరించారన్నదే మూవీ స్టోరీ.
ఇంజినీరింగ్ పూర్తి చేసినా, ఎన్నో తెలివితేటలు ఉన్నా ఉద్యోగం దొరకని ఆ ఇద్దరు గ్రాడ్యుయేట్స్.. సినిమా పైరసీ కేసును పరిష్కరించడంలో సైబర్ సెల్ కు సాయం చేస్తారు. ప్రేమమ్ మూవీ పైరసీకి సంబంధించిన కేసు అది.
దీంతో వాళ్లకు తాత్కాలికంగా తమ దగ్గరే ఉద్యోగం ఇస్తారు. ఆ తర్వాత వాళ్లు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే గ్యాంగ్, పోర్న్ వీడియోలు, మర్డర్ కేసులను కూడా పరిష్కరిస్తారు. ఈ అన్నింట్లోనూ ఆ ఇద్దరి పాత్రే కీలకం.
ఆపరేషన్ జావా దర్శకుడిగా తరుణ్ మూర్తికి తొలి సినిమా. అయినా సైబర్ క్రైమ్ లాంటి సబ్జెక్ట్ ను ఎంచుకొని, అసలు ఆ క్రైమ్ ఎలా జరుగుతుంది? సోషల్ మీడియా, షాపింగ్ మాల్స్ లో కాంటెస్ట్ లంటూ మనం షేర్ చేసే డేటా, నకిలీ ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా దేశంలోని జనం ఎలా మోసపోతున్నారు? వాటిని సైబర్ క్రైమ్ వాళ్లు పరిష్కరించే తీరును ఆసక్తికరంగా స్క్రీన్ పై చూపించడంలో సక్సెస్ అయ్యారు.
2021లో ఈ మూవీ రిలీజైంది. పెద్దగా స్టార్లెవరూ ఈ సినిమాలో కనిపించరు. కథ, కథనాలే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ప్రేమలు ఫేమ్ మమితా బైజు కూడా ఇందులో నటించింది. బాలు వర్గీస్, లూక్మన్ అవరన్, షైన్ టామ్ చాకోలాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు. ఈ ఆపరేషన్ జావా మూవీ జీ5 ఓటీటీలో మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీలో చూడాలనుకుంటే జియోహాట్స్టార్, యూట్యూబ్ లలో ఫ్రీగా చూడొచ్చు.
సంబంధిత కథనం