Abraham Ozler OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
Abraham Ozler OTT Streaming: మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జయరాంతోపాటు మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ ఇప్పుడు హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Abraham Ozler OTT Streaming: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. జయరాం లీడ్ రోల్లో కనిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అబ్రహం ఓజ్లర్ ఓటీటీలో..
మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మార్చి 20) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసిందీ మూవీ. నిజానికి సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం విజయవంతమైంది. జయరాం లీడ్ రోల్లో నటించగా.. సీరియల్ కిల్లర్ గా మమ్ముట్టి అతిథి పాత్రలో కనిపించాడు.
ఈ అబ్రహం ఓజ్లర్ మూవీ మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లు మిస్ కాకుండా ఈ అబ్రహం ఓజ్లర్ చూడండి. జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది.
ఏంటీ అబ్రహం ఓజ్లర్ మూవీ
ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే పాత్రలో జయరాం నటించాడు. ఇక మమ్ముట్టి.. అలెక్స్ అనే సీరియల్ కిల్లర్ పాత్ర పోషించాడు. అసలు ఈ మూవీ కథ ఏంటంటే..
అబ్రహం ఓజ్లర్ భార్యాపిల్లలు మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినా ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. మరోవైపు వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు.
వాళ్ల దగ్గర హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు? అలెక్స్ సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. అబ్రహం ఓజ్లర్ మూవీకి మిదున్ థామస్ దర్శకత్వం వహించాడు.
తెలుగులో జయరాం యాక్టింగ్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. 2018లో రిలీజైన అనుష్క భాగమతి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జయరాం. అల వైకుంఠపురంలో, రాధేశ్యామ్, ఖుషి, హాయ్‌నాన్న సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు. రవితేజ ధమాకాలో విలన్‌గా జయరాం కనిపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ జయరాం కీలక పాత్ర పోషిస్తోన్నాడు.
ఇప్పటికే వివిధ ఓటీటీల్లో కొన్ని మలయాళ క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ సినిమాలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడీ అబ్రహం ఓజ్లర్ కూడా హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వాటిలో మమ్ముట్టి నటించిన భ్రమయుగం, కాదల్ ది కోర్, కన్నూర్ స్క్వాడ్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య వరుస విజయాలతో ఊపు మీదున్న మమ్ముట్టి సీరియల్ కిల్లర్ పాత్ర పోషించిన అబ్రహం ఓజ్లర్ సినిమా చాలా ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు కాకపోయినా వీకెండ్ మాత్రం ఈ మూవీ కచ్చితంగా ప్లాన్ చేయండి.