Honey Rose Complaints Against Social Activist Rahul Easwar: బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్‌గా అలరించిన హనీరోజ్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. మలయాళం హీరోయిన్ అయిన హనీరోజ్ ఇదివరకు తనను కేరళ వ్యాపారవేత్త బాబీ చెమ్మనుర్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సంచలన ఆరోపణలు చేసింది.
దాంతో లైంగిక వేధింపుల ఫిర్యాదుపై బాబీ చెమ్మనూర్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్‌పై ఫేస్‌బుక్ వేదికగా ఆరోపణలు చేసింది. తను చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు తీవ్రతను, ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
రాహుల్ ఈశ్వర్ వల్ల తనకు, తన కుటుంబానికి తీవ్ర మానసిక ఒత్తిడి కలిగిందని హనీ రోజ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. ఈ విషయంపై ఎర్నాకులంలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది హనీ రోజ్.
“రాహుల్ ఈశ్వర్.. నేను, నా కుటుంబం చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాము. మీరు దానికి ప్రధాన కారణాలలో ఒకరు. నాపై బహిరంగ వేదికపై జరిగిన ఘోరమైన చర్యపై నేను ఫిర్యాదు చేశాను. పోలీసులు నా ఫిర్యాదును సరైనదిగా భావించి కేసు నమోదు చేశారు. నేను ఫిర్యాదు చేసిన వ్యక్తిని కోర్టు రిమాండ్ చేసింది” అని హనీ రోజ్ రాసుకొచ్చింది.
"నేను చేయాల్సిందల్లా ఫిర్యాదు చేయడమే. మిగిలినది ప్రభుత్వం, పోలీసులు, కోర్టు చేతుల్లో ఉంటుంది. నా ఫిర్యాదు తీవ్రతను వక్రీకరించడానికి, ప్రజాభిప్రాయాన్ని నాకు వ్యతిరేకంగా మార్చడానికి రాహుల్ ఈశ్వర్ సైబర్ స్పేస్‌లో ఒక వ్యవస్థీకృత నేరాన్ని ప్లాన్ చేస్తున్నాడు" అని ఆ పోస్ట్‌లో హనీ రోజ్ తెలిపింది.
“నన్ను, నా వృత్తిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, ద్వంద్వార్థం వచ్చేలా, అవమానకరమైన వ్యాఖ్యలను నేను ఎదుర్కొంటున్నాను. నిరంతర బెదిరింపులకు రాహుల్ ఈశ్వర్ ప్రధాన కారణం. అతని చర్యలు నన్ను తీవ్రమైన మానసిక వేదనలోకి నెట్టాయి. ఆత్మహత్య ఆలోచనల వైపు కూడా నడిపించాయి. ఈ చర్యలు ఒక మహిళగా నా గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు” అని హనీ రోజ్ చెప్పింది.
“రాహుల్ ఈశ్వర్ నాకు హాని చేస్తానని, నా స్త్రీ తత్వాన్ని అవమానిస్తానని నేరుగా, సోషల్ మీడియా ద్వారా పదేపదే బెదిరించాడు. నా వృత్తిపరమైన అవకాశాలను దెబ్బతీయడానికి కూడా అతను ప్రయత్నించాడు. అతని చర్యల పరిధిని పరిగణనలోకి తీసుకుని, నేను అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను” అని పలు పోస్టుల్లో హనీ రోజ్ రాసుకొచ్చింది.
కాగా, హనీ రోజ్ గతంలో బాబీ చెమ్మనూర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత వ్యాపారవేత్త అయిన బాబీని వయనాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొచ్చిలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో బాబీ చెమ్మనూర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 75, IT చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు అయ్యాయి.
సంబంధిత కథనం