Malayalam Actor: మలయాళం ఇండస్ట్రీ తన సినిమాలతో కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. కానీ కొన్ని రోజులుగా మాత్రం తప్పుడు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. నటుడు షైన్ టామ్ చాకో కొచ్చి హోటల్లో జరిగిన డ్రగ్ రెయిడ్ నుంచి తప్పించుకు పారిపోయాడన్న వార్తలు ఓవైపు ఉండగా.. ఇప్పుడు మరో నటుడు శ్రీనాథ్ భాసి కూడా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈసారి ఓ ప్రొడ్యూసరే ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఫేమ్ శ్రీనాథ్ భాసి తెలుసు కదా. అతడు తాజాగా నాముక్కు కొడతియిల్ కానం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హసీబ్ మలబార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా శ్రీనాథ్ తనను గంజాయి అడిగినట్లు ఆ ప్రొడ్యూసర్ చెప్పాడు. మాతృభూమితో అతడు మాట్లాడాడు. “ఒకరోజు రాత్రి అతడు నన్ను నేరుగా కాదుకానీ.. అతని కోసం నేను నియమించిన ఓ అబ్బాయి నుంచి 3 గంటలకు కాల్ వచ్చింది.
అతనికి స్మోక్ చేయడానికి స్టఫ్ కావాలని, ఎలాగోలా తీసుకురావాలని అడిగాడు. భాసి గంజాయి కావాలని అడుగుతున్నట్లు నాకు 3 గంటలకు కాల్ వచ్చింది. అలా చేయకపోతే మరుసటి రోజు ఉదయం అతడు లొకేషన్ కు రాడు. అతనికి అది దక్కకపోతే సరైన మూడ్ లో ఉండడు” అని హసీబ్ చెప్పాడు.
నిజానికి అప్పటికే గంజాయి అక్కడ ఉందని, కారవాన్ ని ఇందుకోసం ఉపయోగించారని హసీబ్ చెప్పడం గమనార్హం. “కారవాన్ లో గంజాయి కొట్టాడు. దీంతో అతడు లోనికి ఎవరినీ రానీయలేదు. ఒకవేళ పోలీసులు వచ్చి ఉంటే అప్పుడే అతనిపై చర్యలు తీసుకునేవాళ్లు. అందుకే నా డబ్బులన్నీ వృథా అయ్యేకంటే మూవీ షూటింగ్ పూర్తవనీ అని నేను అనుకున్నాను. ఇప్పటికీ అతని గురించి తెలియని ప్రొడ్యూసర్లు అతని వెంట పడుతున్నారు. అతని డేట్ల కోసం వేచి చూస్తున్నారు” అని హసీబ్ తెలిపాడు.
గతంలోనూ శ్రీనాథ్ పై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై అతడు అప్పుడే తన వివరణ ఇచ్చాడు. అయితే తాజాగా వచ్చిన ఆరోపణలపై మాత్రం అతడు స్పందించాల్సి ఉంది. మలయాళం సినిమా ఇండస్ట్రీలో శ్రీనాథ్ ప్రముఖ నటుడు, సింగర్, ఆర్జే. 2011లో ప్రణయం మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. కుంబలంగి నైట్స్, కప్పెల, ట్రాన్స్, మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాల్లో నటించాడు.
సంబంధిత కథనం