Maine Pyaar Kiya re-release: 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ.. డేట్ ఇదే
Maine Pyaar Kiya re-release: బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను స్టార్ ను చేసిన సినిమా, అమాయకపు నవ్వు, అందంతో అలరించిన భాగ్యశ్రీ నటించిన మైనే ప్యార్ కియా రీరిలీజ్ కానుంది. ఈ విషయాన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ వెల్లడించింది.
Maine Pyaar Kiya re-release: దశాబ్దాలు గడుస్తున్నా ప్రేమికుల మదిలో ఎప్పటికీ నిలిచి ఉండిపోయే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మైనే ప్యార్ కియా. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వస్తోంది. 35 ఏళ్ల కిందట అంటే 1989లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నట్లు మూవీని నిర్మించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ వెల్లడించింది.
మైనే ప్యార్ కియా రీరిలీజ్ డేట్
బాలీవుడ్ లో ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో సల్మాన్ ఖాన్ ఓ లవర్ బాయ్‌గా ఇండస్ట్రీలో స్టార్ అయిన విషయం తెలుసా? ఆ సినిమా పేరు మైనే ప్యార్ కియా. అతనితోపాటు ఓ క్యూట్ హీరోయిన్ భాగ్యశ్రీని కూడా పరిచయం చేసిన సినిమా అది. అలాంటి మూవీ ఆగస్ట్ 23న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలిపింది.
సినిమాలోని సల్మాన్, భాగ్యశ్రీకి చెందిన రెండు పోస్టర్లను షేర్ చేస్తూ రీరిలీజ్ విషయాన్ని చెప్పింది. "వాళ్ల ప్రేమ నిండిన స్నేహాన్ని మరోసారి గుర్తు చేసుకునే టైమ్ ఇది. మైనే ప్యార్ కియా ఆగస్ట్ 23న ఎంపిక చేసిన పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్, సినీపోలిస్ ఇండియా థియేటర్లలో రీరిలీజ్ కాబోతోంది" అనే క్యాప్షన్ తో రాజశ్రీ ప్రొడక్షన్స్ రీరిలీజ్ అనౌన్స్ చేసింది.
ఫ్యాన్స్ రియాక్షన్
ఈ మైనే ప్యార్ కియా మూవీలో సుమన్ పాత్ర పోషించిన భాగ్యశ్రీ కూడా ఈ పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ మూవీ రీరిలీజ్ న్యూస్ పై ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపారు. మూవీ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పలువురు కామెంట్స్ చేస్తూ.. రాజశ్రీ ప్రొడక్షన్స్ కు థ్యాంక్స్ చెప్పారు. ఓ మై గాడ్ ఫైనల్లీ.. నా ఆల్ టైమ్ ఫేవరెట్.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ చేశారు.
1989లో మైనే ప్యార్ కియా మూవీ రిలీజైంది. అంతకుముందు ఏడాది బీవీ హో తో ఐసి అనే మూవీతో సల్మాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఈ మైనే ప్యార్ కియాతోనే అతడు రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. సినిమాలోని డైలాగ్స్, పాటలు ఇప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సూరజ్ బార్జత్యా డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ మూవీ 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కానుండటం నిజంగా విశేషమే.