Maidaan trailer: తెరపైకి మరో అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా.. అజయ్ దేవ్‌గన్, ప్రియమణి మైదాన్ ట్రైలర్ చూశారా?
Maidaan trailer: సిల్వర్ స్క్రీన్ పైకి మరో అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. అజయ్ దేవ్‌గన్, ప్రియమణి కలిసి నటించిన మైదాన్ మూవీ ట్రైలర్ గురువారం (మార్చి 7) రిలీజైంది.
Maidaan trailer: చాలా రోజులుగా వేచి చూస్తున్న మైదాన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్, ప్రియమణి నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ట్రైలర్ ను మేకర్స్ గురువారం (మార్చి 7) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇండియన్ ఫుట్‌బాల్ లో గోల్డెన్ ఎరాగా భావించే 1942 నుంచి 1952 మధ్య ఆ పదేళ్ల కాలాన్ని ఈ సినిమా ద్వారా ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు.
మైదాన్ ట్రైలర్
అమిత్ ఆర్ శర్మ డైరెక్ట్ చేసిన మైదాన్ మూవీ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. గతేడాదే మూవీ టీజర్ రిలీజైనా.. రిలీజ్ పెండింగ్ పడటంతో ట్రైలర్ కూడా తీసుకురాలేదు. మొత్తానికి రానున్న రంజాన్ పండగకు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ ఫుట్‌బాల్ కోచ్ గా అజయ్ దేవ్‌గన్ నటించాడు.
ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒకటైన ఇండియాకు ఎంత సామర్థ్యం ఉన్నా.. ఫుట్‌బాల్ విషయంలో మాత్రం సత్తా చాటలేకపోతోందంటూ ట్రైలర్ మొదట్లోనే అజయ్ పాత్ర చెబుతుంది. ఇక అప్పటి నుంచీ అతడు ఓ వరల్డ్ క్లాస్ ఫుట్‌బాల్ జట్టును తయారు చేసే పనిలో పడతాడు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు.
మైదాన్ మూవీ ఏంటి?
బోనీ కపూర్ నిర్మించిన ఈ మైదాన్ మూవీని అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్ట్ చేశాడు. 1942 నుంచి 1952 మధ్య ఫుట్‌బాల్ లో ఇండియన్ టీమ్ కు గోల్డెన్ ఎరాగా చెప్పే కాలాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు.
భారత ఫుట్‌బాల్ పితామహుడిగా ఈ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కు పేరుంది. గతేడాది రిలీజైన టీజర్ కు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూశారు. అయితే అనుకోని కారణాలతో మూవీ చాలా ఆలస్యమైంది. నిజానికి 2020లోనే మైదాన్ మూవీ షూటింగ్ మొదలైంది.
దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేశారు. అయితే అప్పుడే కరోనా వైరస్ రావడం, లాక్ డౌన్ లతో ఆ సెట్ ను చిత్ర నిర్మాత బోనీ కపూర్ తొలగించాల్సి వచ్చింది. ఇక 2021లో తుఫాను కారణంగా మరోసారి మైదాన్ సెట్ ధ్వంసమైంది. మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకొని ఈసారి రంజాన్ పండగకు ఈ మైదాన్ రిలీజ్ కాబోతోంది.