Yatra 2: యాత్ర 2లో చంద్రబాబు పాత్రలో ప్రభాస్ విలన్.. ఆయన ఏ సినిమాలు చేశారంటే?
Mahesh Manjrekar As Chandrababu: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వస్తున్న యాత్ర 2 మూవీలో చంద్రబాబు నాయుడు పాత్రలో ప్రభాస్ విలన్ మహేష్ మంజ్రేకర్ నటించనున్నారు.
Chandrababu Naidu Role Yatra 2: సినిమాల్లో బయోపిక్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రముఖ రాజకీయవేత్తలకు సంబంధించిన బయోపిక్స్ అయితే మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ క్రమంలోనే వచ్చిన సినిమా యాత్ర. 2019లో ఉమ్మది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చి మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా యాత్ర 2 రానుంది.
త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్న యాత్ర 2 చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యమంత్రి కాకముందు వైస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర తెరకెక్కితే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర 2ను నిర్మిస్తున్నారు. ఇందులో తండ్రి వైఎస్సార్ మరణం, తర్వాత నాయకునిగా జగన్ ఎదిగిన తీరుతోపాటు 2009 నుంచి 2019వరకు ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలు ఉండనున్నాయి.
యాత్ర 2 సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా.. ఇందులో నటించే నటీనటుల వివరాలు ఆసక్తిగా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి నటిస్తున్నారు. వైఎస్ జగన్‌గా తమిళ హీరో జీవా చేస్తున్నాడు. జీవా ఇదివరకు రంగం, స్నేహితుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక యాత్ర 2లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రకు ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్‌ను ఎంపిక చేశారు.
ప్రభాస్ సాహో సినిమాలో, గోపీచంద్ ఒక్కడున్నాడు మూవీలో మహేష్ మంజ్రేకర్ విలన్‌గా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఇంకా తెలుగులో హోమం, గుంటూరు టాకీస్ చిత్రాల్లో మహేష్ మంజ్రేకర్ నటించారు. ఆయన హిందీ, మరాఠీ చిత్రాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా యాత్ర 2 సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుంకుంటోంది.