Mahesh Babu - MSD: ఒకే ఫ్రేమ్‍లో ఎంఎస్ ధోనీ, మహేశ్ బాబు.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
Mahesh Babu - MS Dhoni: క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిశారు. అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో ఇద్దరు స్టార్లు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలు ముంబైలో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. పెళ్లి వేడుక శుక్రవారం (జూలై 13) జరుగగా.. నేడు (జూలై 13) శుభ్ ఆశీర్వాద్ సంబరం అట్టహాసంగా సాగుతోంది. ఈ వివాహ వేడుకలకు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. చాలా మంది స్టార్లు సందడి చేస్తున్నారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ కలిశారు.
ఒకే ఫ్రేమ్‍లో తలా, సూపర్ స్టార్
తలా ఎంఎస్ ధోనీతో తాను దిగిన ఫొటోను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేశారు సూపర్ స్టార్ మహేశ్. ‘లెజెండ్‍తో’ అంటూ బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీలను క్యాప్షన్‍గా పెట్టారు. ఈ ఫొటోను సెలెబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తీసినట్టుగా క్రెడిట్ ఇచ్చారు. హకీం గతంలో కొన్ని సందర్భాల్లో మహేశ్, ధోనీకి హెయిర్ స్టైల్ చేశారు.
ధోనీ, మహేశ్ ఇద్దరూ ట్రెడిషనల్ లుక్‍లో మెరిశారు. బ్లాక్ కలర్ షెర్వానీని మహేశ్ ధరించారు. గోల్డ్ కలర్ ఔట్‍ఫిట్‍తో ధోనీ దుమ్మురేపారు.
సంతోషంలో అభిమానులు
ఎంఎస్ ధోనీ, మహేశ్ బాబును ఒకే ఫ్రేమ్‍లో చూసి ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కింగ్‍లు ఒకే ఫొటోలో అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ‘మహీ స్క్వేర్’ అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. చాలా రోజులుగా వీరిద్దరూ కలవాలని కోరుకుంటున్నామని, ఇప్పుడు జరిగింది అంటూ మ్యూచవల్ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ పోస్ట్ చేసిన ఈ ఫొటోకు లైక్‍లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ వివాహ వేడుకలకు మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో కలిసి హాజరయ్యారు. ధోనీ తన భార్య సాక్షితో కలిసి వచ్చారు. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి, అక్కినేని అఖిల్ కూడా వెళ్లారు. బాలీవుడ్, కోలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీలకు చెందిన కొందరు టాప్ సినీ సెలెబ్రిటీలు కూడా ఈ వివాహ వేడుకల్లో పాల్గొంటున్నారు. హార్దిక్ పాండ్యా సహా కొందరు భారత క్రికెటర్లు కూడా వివాహంలో సందడి చేస్తున్నారు.
రాజమౌళితో మహేశ్ మూవీ
దర్శక ధీరుడు రాజమౌళితో గ్లోబల్ రేంజ్ మూవీకి మహేశ్ బాబు ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలుకానుంది. రాజమౌళితో చిత్రం కోసం కొత్త లుక్‍కు మహేశ్ మారుతున్నారు. ప్రస్తుతం దీనిపై పని చేస్తున్నారు. మహేశ్ కొత్త లుక్‍కు అందరి ఫిదా అవుతున్నారు. అంబానీల పెళ్లిలోనూ మహేశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‍గా నిలిచారు.
మరోవైపు, ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2025 సీజన్ ఆడతాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్‍లో చెన్నై గ్రూప్ దశలోనే వైదొలిగింది. ఈ సీజన్‍లో కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‍కు ధోనీ అప్పజెప్పారు. దీంతో ఇదే మహీకి ఆఖరి సీజన్ అంటూ రూమర్లు వచ్చాయి. అయితే, ఈ విషయంపై ధోనీ నుంచి ప్రకటన రాలేదు. దీంతో వచ్చే ఏడాది సీజన్‍పై ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే టెన్షన్ ఉంది.