Mahesh Babu -Ramcharan: 2023లో అగ్ర హీరోలు చాలా మంది వెండితెరపై అభిమానులకు దర్శనమివ్వలేదు. ఏడాదికో సినిమా చేస్తూ వచ్చిన స్టార్ హీరోలు ఈ ఏడాది గ్యాప్ ఇచ్చి ఫ్యాన్స్‌ను డిసపాయింట్ చేశారు. 2023 ఏడాదిలో సినిమాలు చేయని హీరోలు వీళ్లే...
ఈ ఏడాది మహేష్ బాబు మెరుపులు స్క్రీన్‌పై కనిపించలేదు. గత ఏడాది రిలీజైన సర్కారు వారి పాటతో ప్రేక్షకుల్ని పలకరించాడు మహేష్‌బాబు. సినిమా సక్సెస్ అయినా నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ కావడానికి ఆలస్యం కావడం, తండ్రి కృష్ణ మరణంతో ఈ ఏడాది మహేష్ బాబు మూవీ ఏది రిలీజ్ కాలేదు.
2021లో గ్యాప్ తీసుకున్న మహేష్‌బాబు మళ్లీ 2023లో సిల్వర్‌స్క్రీన్‌కు దూరమై అభిమానులను నిరాశపరిచాడు. గుంటూరుకారంతో 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల ముందుకొచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. 2023లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌తో పాటు ఎన్టీఆర్ దేవర, రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
గత కొన్నేళ్లుగా ఏడాది ఒకటి, రెండు సినిమాలు చేస్తూ వచ్చిన ఈ ఇద్దరు స్టార్స్ ఈ ఏడాది గ్యాప్ ఇచ్చి అభిమానులకు షాకిచ్చారు. ఎన్టీఆర్ దేవర వచ్చే ఏడాది ఏప్రిల్‌లో...రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ వేసవి తర్వాత రిలీజ్ కాబోతున్నాయి.
ఈ ఏడాది నాగార్జున కూడా సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ఘోస్ట్ డిజాస్టర్‌తో నెక్స్ట్ మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేసిన నాగ్ 2023లో సినిమా చేయలేదు. ప్రస్తుతం నా సామిరంగ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు నాగ్. మలయాళంలో విజయవంతమైన పురింజు మరియం జోస్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది.
మరో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించలేదు. కానీ హిందీలో మాత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ తో పాటు రానా నాయుడు వెబ్‌సిరీస్‌లు చేశాడు. సైంధవ్‌తో నాగార్జున, మహేష్‌బాబులతో వెంకటేష్ కూడా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాడు.
డీజే టిల్లుతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా 2023 తెలుగు ప్రేక్షకులకు దర్శనమివ్వలేదు. డీజే టిల్లు సీక్వెల్‌తోనే 2024లోనే మళ్లీ కనిపించబోతున్నాడు. వీరితో పాటు రానా దగ్గుబాటి కూడా స్పైలో గెస్ట్ రోల్ మినహా ఈ ఏడాది ఏ సినిమా చేయలేదు.